KTR: కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ పై కేటీఆర్ ఆగ్రహం

KTR anger on Kamareddy municipal commissioner
  • కామరెడ్డి మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తున్న 8 గ్రామాల ప్రజలు
  • ఇండస్ట్రియల్ జోన్ కు తమ భూములను ఇవ్వలేమని ఆందోళన
  • మాస్టర్ ప్లాన్ సమస్య ఎందుకొచ్చిందన్న కేటీఆర్
కామారెడ్డి ఇండస్ట్రియల్ జోన్ మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులు ఆందోళన చేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. మాస్టర్ ప్లాన్ సమస్య ఎందుకు వచ్చిందని మున్సిపల్ కమిషనర్ ను కేటీఆర్ ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ స్టేజ్ లో ఉందని ప్రజలకు ఎందుకు చెప్పలేకపోయారని మున్సిపల్ కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు ఈ ప్రభుత్వం లేదని అన్నారు. నగరాలను అభివృద్ధి చేసేందుకే మాస్టర్ ప్లాన్ అని చెప్పారు. 

కామారెడ్డి ఇండస్ట్రియల్ జోన్ మాస్టర్ ప్లాన్ లో ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఎనిమిది గ్రామాలను చేర్చారు. ఈ గ్రామాల రైతుల నుంచి భూములను సేకరించి ఇండస్ట్రియల్ కారిడార్ కు కేటాయించనున్నారు. అయితే దీన్ని ఆయా గ్రామాల రైతులు వ్యతిరేకిస్తున్నారు. తమకు జీవనోపాధిని కల్పించే భూములను ఇవ్వబోమని అంటున్నారు. 

తన భూమి పోతుందనే భయంతో రాములు అనే రైతు నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ ఎనిమిది గ్రామాలకు చెందిన రైతులు ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకుని ఆందోళనకు దిగారు. తాము భూములను వదులుకునే ప్రసక్తే  లేదని అన్నారు. రైతులకు మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డిలు సైతం ధర్నాలో పాల్గొన్నారు.
KTR
BRS
Kamareddy

More Telugu News