Cardiovascular disease: వృద్ధులు వీలైనంత ఎక్కువ సేపు నడిస్తే గుండెకు మంచిదట.. తాజా అధ్యయనంలో వెల్లడి!

  • నిత్యం 10వేల అడుగులు నడవాలి
  • హార్ట్ ఎటాక్, స్ట్రోక్ రిస్క్ గణనీయంగా తగ్గుదల  
  • అమెరికాతో పాటు 42 దేశాల్లో అధ్యయనం  
Cardiovascular disease Walking 6000 steps daily may lower risk for older adults

60 ఏళ్లు నిండిన వృద్ధుల కోసం ఇటీవల ఒక అధ్యయనం జరిగింది. 6,000 నుంచి 9,000 వరకు రోజువారీగా అడుగులు వేసే వారికి గుండె జబ్బుల రిస్క్ చాలా వరకు తగ్గుతున్నట్టు అధ్యయనకారులు గుర్తించారు. ప్రస్తుతం రోజువారీగా 3,000 అడుగులే నడిచే వారితో పోలిస్తే, దానికి రెట్టింపు నడిచే వారికి ఎక్కువ మేలు జరుగుతుందని పరిశోధకులు అంటున్నారు. అమెరికాలో 20వేల మందికి పైగా, మరో 42 దేశాల్లో నిర్వహించిన ఎన్నో అధ్యయన ఫలితాలను విశ్లేషించి ఈ ఫలితాలను పరిశోధకులు ప్రకటించారు. 

నిత్యం 6,000 అంతకంటే ఎక్కువ అడుగులు నడిచే వారికి హార్ట్ ఎటాక్, స్ట్రోక్ రిస్క్ 40-50 శాతం తగ్గుతుందని తేలింది. గతంలో నిర్వహించిన అధ్యయనంలో రోజూ 8,200 అడుగులు నడిచే వారికి చాలా వరకు ఆరోగ్య సమస్యల రిస్క్ ను తగ్గిస్తున్నట్టు గుర్తించారు. కనుక వీలైనంత మేర నడవడమే మంచిది. రోజుకు 15,000 అడుగులు నడిచే వారిలో గుండె జబ్బులు వృద్ధి చెందే రిస్క్ చాలా వరకు తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు. అందుకని రోజుకు కనీసం 10,000 అడుగులు నడిచే లక్ష్యాన్ని పెట్టుకోవాలని సూచిస్తున్నారు. 

యువతీ, యువకుల్లో నిత్యం నడకను పెంచడం వల్ల గుండె జబ్బుల రిస్క్ పరంగా వ్యత్యాసం ఏమీ కనిపించలేదు. సాధారణంగా వయసు మీద పడుతున్న కొద్దీ గుండె జబ్బుల బారిన పడుతుంటారు. కనుక చిన్న వయసులోని వారికి రిస్క్ లో వ్యత్యాసం కనిపించలేదని భావించొచ్చు. శారీరకంగా చురుగ్గా పనిచేయడం వల్ల రక్తపోటు, స్థూలకాయం, టైప్2 మధుమేహం రిస్క్ ను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

More Telugu News