swiggy: నోయిడాలో ఘోర ప్రమాదం.. స్విగ్గీ ఏజెంట్ ను ఈడ్చుకెళ్లిన కారు

Swiggy Agent Dies After Car Hits and Drags Him For 500 Metres In Noida
  • కొత్త ఏడాదిలో గంటల వ్యవధిలోనే రెండో ప్రమాదం
  • అర కిలోమీటరు మేర యువకుడిని ఈడ్చుకెళ్లాక కారును ఆపిన డ్రైవర్
  • తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోయిన డెలివరీ బాయ్
దేశరాజధానిలో కొత్త సంవత్సరం రోజు జరిగిన ఘోర ప్రమాదం తరహాలోనే నోయిడాలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. స్విగ్గీ డెలివరీ ఏజెంట్ ను ఢీ కొట్టిన కారు.. దాదాపు అర కిలోమీటరు మేర ఆ యువకుడిని ఈడ్చుకెళ్లింది. తీవ్రగాయాలపాలైన ఆ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. జనవరి 1న అర్ధరాత్రి నోయిడాలోని సెక్టార్ 14 లో ఈ ప్రమాదం జరిగింది.

నోయిడాకు చెందిన కౌశల్ స్విగ్గీ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. జనవరి 1న రాత్రిపూట డెలివరీ కోసం వెళుతుండగా సెక్టార్ 14 లోని ఓ ఫ్లై ఓవర్ దగ్గర వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. బైక్ తో పాటు కౌశల్ కారు కిందపడిపోయాడు. కారు అలాగే ఆగకుండా ముందుకు వెళ్లిపోయింది. కారు కింద చిక్కుకున్న కౌశల్ ను ఈడ్చుకుంటూ దాదాపు అర కిలోమీటర్ మేర వెళ్లింది. అక్కడ కారును ఆపి కిందికి దిగిన డ్రైవర్ కు కౌశల్ బాడీ కనిపించింది. 

దీంతో భయపడి డ్రైవర్ పారిపోయాడని ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న వాళ్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఈ ప్రమాదానికి కొన్ని గంటల ముందు ఢిల్లీలోనూ ఇలాంటి ప్రమాదమే చోటుచేసుకుంది. స్కూటీపై వెళుతున్న ఓ యువతిని ఢీ కొట్టిన కారు.. ఆమెను 12 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది.
swiggy
noida
Road Accident
car dragged man

More Telugu News