Drinking water: సరిపడా నీరు తాగకపోతే ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?

  • రక్తంలో సోడియం మోతాదు మించితే ఆరోగ్య సమస్యలు
  • సోడియం మోతాదును నీరు తగ్గిస్తుంది
  • తక్కువ తాగే వారికి త్వరగా వృద్ధాప్యం, దీర్ఘకాలిక వ్యాధులు
Not Drinking Enough Water Linked to Serious Health Risks Study Warns

నీరు ప్రాణాధారం. ఆహారం లేకుండా కొన్ని రోజుల పాటు జీవించొచ్చు కానీ, నీరు లేకుండా మాత్రం ఎక్కువ రోజులు ప్రాణాలతో ఉండడం అసాధ్యం. ఇక రోజువారీ తగినంత నీరు తాగడం కూడా ఎంతో అవసరం. కొందరు తక్కువగా, కొందరు మధ్యస్థంగా, కొందరికి నీరు ఎక్కువ తాగే అలవాటు ఉంటుంది. వీరిలో చాలా తక్కువ తాగే వారికి భవిష్యత్తులో ఎన్నో ఆరోగ్య సమస్యల ముప్పు ఉంటుందని తాజా పరిశోధన ఒకటి హెచ్చరిస్తోంది. 

ఎక్కువ, తక్కువ కాకుండా, శరీరంలో తగినంత నీటి పరిమాణం (హైడ్రేటెడ్) ఉండేలా చూసుకోవాలన్నది ఈ అధ్యయనం ఫలితాలు సూచిస్తున్నాయి. సరిపడా నీరు తాగడం వల్ల ఆరోగ్యంగా, ఎక్కువ కాలం పాటు జీవించొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. 25 ఏళ్ల కాలంలో 11,255 మందిపై ఈ పరిశోధన జరిగింది. మొత్తం ఐదు పర్యాయాలు వారిని పలు ప్రశ్నలు వేసి వివరాలు రాబట్టారు. సామాజిక ఆర్థిక స్థాయి, కుటుంబ వైద్య చరిత్రను కూడా తెలుసుకున్నారు.

క్లినికల్ పరీక్షల్లో భాగంగా ఈ వలంటీర్ల రక్త నమూనాలను పరీక్షించి చూశారు. ముఖ్యంగా రక్తంలో సోడియం ఎంతున్నది గమనించారు. ఎక్కువ నీరు తీసుకుంటే రక్తంలో సోడియం అంత తక్కువగా ఉంటుంది. సరిపడా నీరు తాగుతూ, సోడియం తక్కువగా ఉంచుకునే వారిలో వృద్ధాప్య ఛాయలు ఆలస్యమవుతున్నట్టు, వ్యాధుల్లేకుండా ఎక్కువ కాలం ఉంటున్నట్టు తెలుసుకున్నారు. మేరీలాండ్ కు చెందిన నేషనల్ హార్ట్ లంగ్ అండ్ బ్లడ్ ఇనిస్టిట్యూట్ కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. రీసెర్చ్ సైంటిస్ట్ నటాలియా దిమిత్రియా పరిశోధన వివరాలను వెల్లడించారు.

సాధారణంగా రక్తంలో సోడియం పరిమాణం 125-146 మిల్లీ ఈక్వలెంట్ పర్ లీటర్ ఉండాలి. గరిష్ఠ పరిమితికి మించి రక్తంలో సోడియం కొనసాగినప్పుడు అది దీర్ఘకాలంలో హార్ట్ ఫెయిల్యూర్, స్ట్రోక్, ఎట్రియల్ ఫిబ్రిలేషన్, క్రానిక్ లంగ్ డిసీజ్, మధుమేహం, డిమెన్షియాలకు దారితీసే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 

రక్తంలో సోడియం స్థాయులను పరీక్షించుకుని, మోతాదుకు మించి ఉంటే వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలన్నది సూచన. రోజువారీ తీసుకునే నీటి పరిమాణాన్ని పెంచడం, పండ్ల రసాలు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. తమ పరిశోధన ఉద్దేశ్యం.. తగినంత నీరు తీసుకునేలా చూడడమేని ఈ పరిశోధనలో ముఖ్య పాత్ర పోషించిన మాన్ ఫ్రెడ్ బోహెమ్ పేర్కొన్నారు. 

ఇక రక్తంలో సోడియం స్థాయిని కేవలం నీరు ఒక్కటే నిర్ణయించదు. వయసు, లింగం, మధుమేహం, పొగతాగడం ఇవి కూడా పాత్ర పోషిస్తాయి. కాకపోతే పరిశోధకులు ఇలాంటి వారిని వలంటీర్లుగా తీసుకోలేదు. రక్తంలో సోడియం మోతాదు అధికంగా ఉండే వారు దాన్ని తగ్గించుకునేందుకు అవసరమైతే వైద్యుల సలహా పొందడం మంచిది. స్వచ్ఛమైన నీరు రోజుకు 2-3 లీటర్ల వరకు తాగడం ఆరోగ్యకరమైన స్థాయి.

More Telugu News