Pakistan: విద్యుత్ పొదుపు కోసం పాక్ లో మాల్స్ మూసివేత

Pakistan shuts malls to save energy as it grapples with economic crisis
  • మార్కెట్లు, మ్యారేజీ హాళ్లకు కూడా రాత్రిపూట తాళాలు
  • పాతతరం బల్బులు, ఫ్యాన్ల ఉత్పత్తి త్వరలో నిలిపివేత
  • వీధి లైట్లను ఆల్టర్నేటివ్ గా వాడాలని పాక్ కేబినెట్ నిర్ణయం
ఆర్థిక రంగం కుదేలవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్థాన్ ప్రభుత్వం వీలు కుదిరిన చోటల్లా పొదుపు మంత్రం పాటిస్తోంది. విదేశాల్లో నిరుపయోగంగా ఉంటున్న ఆస్తులను గుర్తించి అమ్మకానికి పెడుతోంది. దేశంలోనూ పొదుపు చర్యలు పాటించడంలో కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా విద్యుత్ ఖర్చును తగ్గించుకోవడానికి వినూత్న నిర్ణయం తీసుకుంది. షాపింగ్ మాల్స్, మ్యారేజీ హాళ్లు రాత్రిపూట తెరిచి ఉంచడంపై ఆంక్షలు విధించింది. రాత్రి 8:30 గంటలకల్లా షాపింగ్ మాల్స్, రాత్రి పది దాటేలోగా మ్యారేజీ హాళ్లు మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది.

నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ ప్లాన్ లో భాగంగా మంగళవారం పాకిస్థాన్ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆయిల్ పైనా ఆంక్షలు విధించాలని నిర్ణయించింది. మార్కెట్లు, మ్యారేజీ హాళ్లు, షాపింగ్ మాల్స్ ను రాత్రిపూట త్వరగా మూసేయడం వల్ల దాదాపు 6 వేల కోట్లు పొదుపు చేయొచ్చని పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి క్వాజా ఆసిఫ్ పేర్కొన్నారు.

పాత తరం విద్యుత్ బల్బుల ఉత్పత్తిని ఫిబ్రవరి 1 నుంచి, కొన్ని రకాల ఫ్యాన్ల ఉత్పత్తిని జులై నుంచి ఆపేయనున్నట్లు మంత్రి చెప్పారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.2.2 వేల కోట్ల భారం తగ్గుతుందని మంత్రి వివరించారు. వంట గ్యాస్ వాడకాన్ని తగ్గించేందుకు కోనికల్ గీజర్ల వాడకాన్ని తప్పనిసరి చేయనున్నట్లు తెలిపారు. దీంతో మరో 9.2 వేల కోట్ల రూపాయలు ఆదా చేయాలని, వీధి లైట్లను ఆల్టర్నేటివ్ గా ఉపయోగించడం ద్వారా రూ. 4 వేల కోట్లు పొదుపు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి క్వాజా ఆసిఫ్ వివరించారు.
Pakistan
energy saving
economic crisis
pak governament
shoping malls

More Telugu News