Supreme Court: సినిమా హాల్ ప్రైవేటు ఆస్తి.. బయటి ఫుడ్‌ను అనుమతించాలా? లేదా? అన్నది వారిష్టం: సుప్రీంకోర్టు

  • బయటి తినుబండారాలను అనుమతించాల్సిందేనంటూ 2018లో జమ్మూకశ్మీర్ హైకోర్టు తీర్పు
  • హైకోర్టు తన పరిధిని అధిగమించి ఈ తీర్పు చెప్పిందన్న సుప్రీం కోర్టు
  • థియేటర్ ప్రాంగణంలో నియమనిబంధనలు యజమాని ఇష్టమన్న ధర్మాసనం
  • పసిపిల్లల కోసం పెద్దలు తెచ్చే ఆహారాన్ని మాత్రం అనుమతించాలని స్పష్టీకరణ
  • పరిశుభ్రమైన తాగునీరు అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంచాలని ఆదేశం
Cinema hall private property owners can regulate moviegoers from carrying outside food and beverages

సినిమా హాళ్ల యజమానులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చే తీర్పు చెప్పింది. సినిమా థియేటర్లు ప్రైవేటు ఆస్తి అని, బయటి నుంచి ప్రేక్షకులు తెచ్చుకునే ఆహార పదార్థాలను, పానీయాలను లోపలికి అనుమతించాలా? వద్దా? అనేది వారిష్టమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది. అయితే, పసిపిల్లల కోసం తల్లిదండ్రులు తీసుకొచ్చే ఆహారాన్ని మాత్రం అడ్డుకోవడానికి వీల్లేదని పేర్కొంది.

‘‘సినిమా థియేటర్లు ప్రైవేటు ఆస్తులు. హాలు ప్రాంగణంలో పాటించాల్సిన నియమనిబంధనలను నిర్ణయించే హక్కు యజమానులకు ఉంటుంది. బయటి నుంచి ఎవరైనా సినిమా హాల్‌లోకి జిలేబీ తెచ్చుకుంటే దానిని అడ్డుకునే హక్కు యజమానికి ఉంటుంది. జిలేబీ తిన్నాక ప్రేక్షకుడు తన చేతులను సీట్లకు తుడిచి వాటిని పాడుచేస్తాడు’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. 

అంతేకాదు, ఆరోగ్యకరమైన తాగునీటిని థియేటర్‌లో అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత యాజమాన్యానిదేనని, పసిపిల్లల కోసం తల్లిదండ్రులు తెచ్చే ఆహారాన్ని మాత్రం అనుమతించాలని స్పష్టం చేసింది. అంతమాత్రాన ప్రతి ఆహార పదార్థాన్ని లోపలికి అనుమతించాల్సిన పనిలేదని పేర్కొంది. 

జమ్మూకశ్మీర్ హైకోర్టు ఓ కేసులో తీర్పు చెబుతూ.. ప్రేక్షకులు బయటి నుంచి తెచ్చే తినుబండారాలు, పానీయాలను సినిమా హాళ్లు, మల్టీప్లెక్సులు అడ్డుకోవద్దని 2018లో ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీం ధర్మాసనం పై విధంగా తీర్పు చెప్పింది. జమ్మూకశ్మీర్ హైకోర్టు తన పరిధిని దాటి ఆ తీర్పును వెలవరించిందని పేర్కొంది.

More Telugu News