Bonda Uma: ఒక పార్టీ గొంతు నొక్కడానికి అన్ని పార్టీలకు ఉరితాడు వేయాలని జగన్ చూస్తున్నాడు: బొండా ఉమ

  • ర్యాలీలను నిషేధించే జీవో నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదన్న బొండా ఉమ
  • ఈ జీవోను మేము తీసుకొచ్చి ఉంటే జగన్ సభలు పెట్టేవాడా? అని ప్రశ్న
  • ఈరోజు జరిగే జగన్ రోడ్ షోను ఆపాలని డిమాండ్
Bonda Uma demands to stop Jagan rally

రోడ్లపై సభలు, ర్యాలీలు నిర్వహించకుండా నిషేధం విధిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాదని టీడీపీ నేత బొండా ఉమ ఎద్దేవా చేశారు. వీళ్లు చెప్పిన చోటే మీటింగ్ పెట్టుకోవాలంట అని విమర్శించారు. రాబోయే రోజుల్లో మేధావులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలకు మీరు ఇదే మాట్లాడాలి అంటూ తాడేపల్లి ప్యాలస్ నుంచి నోట్ వస్తుందని... అప్పుడు మనం అదే మాట్లాడాల్సి వస్తుందని మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు.

ఈ జీవోను అమలు చేయాలనుకుంటే ఈరోజు రాజమండ్రిలో జరగనున్న జగన్ సభ దగ్గర నుంచి అమలు చేయాలని చీఫ్ సెక్రటరీని, హోం సెక్రటరీని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. రాజమండ్రి మున్సిపల్ గ్రౌండ్ నుంచి సభా ప్రాంగణం వరకు 3 కిలోమీటర్ల రోడ్ షోను జగన్ పెట్టాడని... దాన్ని ఆపండని చెప్పారు. ఈ జీవోను ఫస్ట్ మీ దగ్గర నుంచే స్టార్ట్ చేయండని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో వస్తున్న స్పందన నేపథ్యంలో ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ఇచ్చిన జీవోను తాము లెక్కచేయబోమని చెప్పారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి జీవో ఇస్తే నీవు పాదయాత్ర చేసేవాడివా? అంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. నీ బహిరంగసభలు రోడ్లు మీద పెట్టావో, గ్రౌండ్ లో పెట్టావో, ఎవరి ఇంటి మీదైనా పెట్టావో ఒకసారి తాడిపల్లి ప్యాలస్ లో వీడియోలు వేసుకుని చూసుకో అన్నారు. అధికారం ఉంది కదా అని ప్రతిపక్షాలే లేకుండా చేస్తానంటే కుదిరేది కాదని చెప్పారు. ఒక పార్టీ గొంతు నొక్కడానికి అన్ని పార్టీల మెడలకు ఉరితాడు వేయాలని జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. జగన్ రాజమండ్రి సభకు ఎలా అనుమతినిచ్చారని ప్రశ్నించారు. తాము యథావిధిగా సభలు, ర్యాలీలను నిర్వహించి తీరుతామని చెప్పారు.

More Telugu News