delhi accident: ఢిల్లీ యాక్సిడెంట్ కేసులో ట్విస్ట్.. ప్రమాద సమయంలో స్కూటీపై మరో యువతి కూడా ఉంది.. వీడియో ఇదిగో!

Delhi woman not alone when her scooter met with an accident
  • ఓ హోటల్ ఆవరణ నుంచి స్కూటీపై బయలుదేరిన స్నేహితురాళ్లు
  • తొలుత స్నేహితురాలే బండి నడిపింది.. మధ్యలో స్కూటీని తీసుకున్న బాధితురాలు
  • ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడిన యువతి.. భయంతో పరారీ
  • ఆ యువతిని గుర్తించామని, త్వరలో ఆమెను విచారిస్తామని చెప్పిన పోలీసులు
దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన యువతి యాక్సిడెంట్ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో స్కూటీపై బాధితురాలితో పాటు మరో యువతి కూడా ఉందని సీసీటీవీ ఫుటేజీ పరిశీలనలో బయటపడింది. ఓ హోటల్ జరిగిన కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొన్న స్నేహితులు ఇద్దరూ అర్ధరాత్రి దాటాక 1:45 గంటలకు స్కూటీపై బయలుదేరడం కనిపించిందని పోలీసులు చెబుతున్నారు. హోటల్ ముందున్న సీసీటీవీ కెమెరాల్లో వాళ్లు స్కూటీపై బయలుదేరడం రికార్డయిందని చెప్పారు.

ఆదివారం తెల్లవారుజామున స్కూటీని ఢీ కొట్టిన కారు.. ఓ యువతిని 12 కిలోమీటర్ల మేర లాక్కెళ్లిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో చనిపోయిన యువతిని అంజలి సింగ్ గా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో అంజలితో పాటు ఆమె స్నేహితురాలు నిధి కూడా ఉందని, స్వల్ప గాయాలతో బయటపడ్డ నిధి.. భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయిందని చెప్పారు. స్నేహితురాళ్లు ఇద్దరూ ఓ హోటల్ లో జరిగిన కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొని తిరిగొస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని చెప్పారు. హోటల్ దగ్గర బయలుదేరినపుడు స్కూటీని నిధి నడుపుతోందని.. మధ్యలో వాళ్లిద్దరూ తమ సీట్లు మార్చుకున్నారని వివరించారు.

కాగా, నిధి జాడ కనుక్కున్నామని, ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై తనను ప్రశ్నిస్తామని పోలీసులు చెప్పారు. మరోవైపు, ప్రమాదానికి కారణమైన కారులో ఐదుగురు యువకులు ఉన్న విషయం తెలిసిందే. ప్రమాదం జరిగినపుడు తాము మద్యం మత్తులో ఉన్న విషయం నిజమేనని వాళ్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. కారు కింద ఏదో చిక్కుకున్నట్లు తనకు అనిపించిందని ప్రమాద సమయంలో డ్రైవింగ్ చేస్తున్న దీపక్ ఖన్నా విచారణలో చెప్పినట్లు సమాచారం. అయితే, మిగతా నలుగురు తన మాటలను కొట్టిపారేయడంతో కారును ఆపకుండా తీసుకెళ్లినట్లు దీపక్ వివరించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
delhi accident
woman dragged by car
12 km dragged
delhi
new year celebrations

More Telugu News