Vishnu Vardhan Reddy: ఏపీలో రోడ్డు సభలపై నిషేధం విధించడంపై విష్ణువర్ధన్ రెడ్డి స్పందన

  • విపక్షాలు సభలే జరపకూడదనే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయన్న విష్ణు 
  • దీనిపై ప్రభుత్వం స్పష్టతను ఇవ్వాలని డిమాండ్ 
  • చంద్రబాబు సభ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటే అభ్యంతరం లేదని వ్యాఖ్య 
  • రాజకీయ పార్టీల సభలకు అనుమతులు ఇవ్వాలన్న బీజేపీ నేత 
Vishnu Vardhan Reddy response on banning public meetings

రాష్ట్రంలోని రహదారులపై రాజకీయ పార్టీలు సభలను నిర్వహించకుండా వైసీపీ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అధికార పార్టీకి ఒక రకరమైన నిబంధనలు, విపక్ష పార్టీలకు మరో రకమైన నిబంధనలు విధించడం సరికాదని ఆయన అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సభలో ప్రజలు చనిపోవడం బాధాకరమని... ఈ ఘటనపై సభ నిర్వాహకులపైన లేదా టీడీపీపైన చర్యలు తీసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదని... సభకు అనుమతులు కోరిన వారిపై కూడా చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. 

భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర ఘటనలు జరగకుండా ప్రభుత్వం సక్రమమైన నిర్ణయాలను తీసుకోవాలే కానీ... విపక్ష పార్టీలు సభలే జరపకుండా చూడాలనుకోవడం సరికాదని విమర్శించారు. పోలీసుల మార్గదర్శకాలకు అనుగుణంగానే రాజకీయ పార్టీలు సభలను నిర్వహించుకుంటాయని... రాజకీయ పార్టీల సభలకు అనుమతులు ఇవ్వాలని అన్నారు. విపక్షాల సభలే జరగకుండా చూడాలని ప్రభుత్వం యత్నిస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయని... దీనిపై ప్రభుత్వం స్పష్టతను ఇవ్వాలని డిమాండ్ చేశారు.

More Telugu News