Pakistan: ప్లాస్టిక్ కవర్లలో వంటగ్యాస్‌ను నిల్వ చేసుకుంటున్న పాక్ ప్రజలు.. వీడియో ఇదిగో!

  • తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్
  • మౌలిక సదుపాయాలకు దూరమవుతున్న ప్రజలు
  • తగ్గిపోతున్న పెట్రోలియం, వంట గ్యాస్ నిల్వలు
  • రెండేళ్లుగా గ్యాస్ లేకుండానే బతుకుతున్న హంగూ నగర ప్రజలు 
Pakistanis fill cooking gas in plastic balloons as economic crisis grips nation

పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభానికి అద్దం పట్టే దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అక్కడి ప్రజలు వంట గ్యాస్‌ను ప్లాస్టిక్ కవర్లలో నింపి నిల్వ చేసుకుంటున్నారు. ప్లాస్టిక్ కవర్లలో వంట గ్యాస్‌ను నింపుకోవడమంటే ప్రాణాలతో చెలగాటం ఆడడమే. అయినప్పటికీ అక్కడి వంట గ్యాస్‌ను ప్లాస్టిక్ కవర్లలో నింపి తీసుకెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ తిరుగుతున్నాయి. 

దేశాన్ని వంట గ్యాస్ కొరత వేధిస్తుండడంతో ప్రజలు ఇలా కవర్లలో నింపుకుంటున్నట్టు అక్కడి మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించిన ప్రభుత్వం ప్లాస్టిక్ బ్యాగుల వినియోగంపై నిషేధం విధించింది. ఇక, ఖైబర్ ఫఖ్తుంఖ్వా జిల్లాలోని కరక్ జిల్లా ప్రజలు ఇప్పటికే వంట గ్యాస్‌కు దూరంగా ఉన్నారు. హంగూ నగర ప్రజలు రెండేళ్లుగా గ్యాస్ కనెక్షనే లేకుండా జీవిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. 

పాక్ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా అందించలేకపోతోంది. ఉద్యోగుల వేతనాల్లో కోత కూడా విధిస్తోంది. ఇక, నిత్యావసరాల ధరలైతే చెప్పక్కర్లేకుండా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం వంట గ్యాస్‌ను సరఫరా చేయలేకపోతుండడంతో ప్రజలు ఇలా ప్లాస్టిక్ కవర్లలో వంట గ్యాస్‌ను నిల్వ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ద్రవ్యోల్బణం, పెట్రోలియం, గ్యాస్ నిల్వలు తగ్గిపోవడం, కరెన్సీ విలువ పడిపోవడం వంటి అంశాలు పాకిస్థాన్‌ను కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి.

More Telugu News