Pakistan: కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పాక్ స్టేడియంలో రాత పరీక్ష

  • నిర్వహణ ఖర్చులు భరించలేక పాకిస్థాన్ ప్రభుత్వ నిర్ణయం
  • 1,667 పోస్టులకు 32 వేల దరఖాస్తులు
  • దాయాది దేశంలో తీవ్రమైన నిరుద్యోగం
  • యువతలో 31శాతం నిరుద్యోగులే
written test for conistable jobs held in pakisthan stadium

ఉద్యోగ నియామకాలకు నిర్వహించే రాత పరీక్ష ఎంత పకడ్బందీగా జరుగుతుందో తెలిసిందే.. పరీక్ష హాలులోకి ప్రవేశించే ముందే తనిఖీలు, హాలులో ఒకరికి ఇద్దరు చొప్పున ఇన్విజిలేటర్లు.. ఇలా కాపీయింగ్ జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే, పాకిస్థాన్ లో జరిగిన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామక పరీక్షను అధికారులు భిన్నంగా నిర్వహించారు. రాత పరీక్ష కోసం వచ్చిన అభ్యర్థులను అందరినీ స్టేడియానికి తరలించి, అందులోనే పరీక్ష నిర్వహించారు.

పాక్ ప్రభుత్వం ఇటీవల 1,667 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికోసం 32 వేల మంది యువతీయువకులు దరఖాస్తు చేసుకున్నారు. వీళ్లందరికీ రాత పరీక్ష నిర్వహించేందుకు చాలా ఖర్చవుతుందని, అంత ఖర్చును ప్రభుత్వం భరించలేదని అధికారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. వచ్చిన అభ్యర్థులు అందరినీ ఇస్లామాబాద్ లోని స్టేడియంకు తరలించారు. ప్రేక్షకుల గ్యాలరీతో పాటు గ్రౌండ్ లోనూ వారిని కూర్చోబెట్టి తెల్ల పేపర్ పై పరీక్ష రాయించారు.

ఈ పరీక్షకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాకిస్థాన్ ఆర్ధిక పరిస్థితిని, ఆ దేశంలోని నిరుద్యోగుల పరిస్థితిని ఈ చిత్రం కళ్లకు కడుతోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా, పాకిస్థాన్ యువతలో దాదాపు 31 శాతం మంది నిరుద్యోగులే ఉన్నారని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

More Telugu News