Rishabh Pant: రోడ్డుపై గుంత కారణంగానే పంత్ ప్రమాదానికి గురయ్యాడంటున్న స్థానికులు

  • డిసెంబరు 30న పంత్ కు రోడ్డు ప్రమాదం
  • ఉత్తరాఖండ్ వెళుతుండగా అదుపుతప్పిన కారు
  • డివైడర్ పైకి దూసుకెళ్లి కాలిపోయిన వైనం
  • గాయాలతో ఆసుపత్రిపాలైన పంత్
Locals said pothole leads Pant car mishap

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురికావడం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లో ఉన్న తల్లికి నూతన సంవత్సరం సందర్భంగా సర్ ప్రైజ్ ఇచ్చేందుకు ఆమెకు చెప్పకుండా బయల్దేరిన పంత్.... రూర్కీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. పంత్ నడుపుతున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్ పైకి ఎక్కి మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదం నుంచి పంత్ గాయాలతో బయటపడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

అయితే స్థానికులు ఈ ప్రమాదానికి రోడ్డుపై ఉన్న గుంతే కారణం అని అంటున్నారు. రవీంద్ర రాఠీ, పంకజ్ కుమార్, ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తులు మీడియాతో మాట్లాడుతూ, పంత్ యాక్సిడెంట్ కు గురైన చోట గతంలోనూ పలు రోడ్డు ప్రమాదాలు జరిగాయని, కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారని వివరించారు. 

ఈ ప్రాంతంలో హైవే ఇరుకుగా మారడం వలన సర్వీసు రోడ్డు ఇంతవరకు ఏర్పాటుకు నోచుకోలేదని, ఇక్కడున్న మలుపుల వద్ద డ్రైవర్లు తడబాటుకు గురవుతుంటారని తెలిపారు. ముఖ్యంగా, ఈ రోడ్డుపై గుంత అనేక ప్రమాదాలకు కారణమైందని, పంత్ కారు టైరు ఆ గుంతలో పడడంతో కారు అదుపు తప్పినట్టు స్థానికులు అభిప్రాయపడ్డారు. ఇదొక మృత్యు ప్రదేశంగా మారినా, రోడ్డు మరమ్మతు చర్యలు మాత్రం చేపట్టడంలేదని వారు విమర్శించారు.

అటు, ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) డైరెక్టర్ శ్యామ్ శర్మ కూడా స్థానికుల వాదనను బలపరిచారు. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి పంత్ ప్రమాదానికి గురయ్యాడని తెలిపారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సైతం దీన్ని నిర్ధారించారు. రోడ్డుపై గుంతే పంత్ కారు ప్రమాదానికి కారణం అని ఊహాగానాలకు తెరదించారు.

More Telugu News