Chandrababu: వైసీపీ నేతలను హెచ్చరిస్తున్నా... ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది: కోవూరులో చంద్రబాబు

  • నెల్లూరులో పర్యటిస్తున్న చంద్రబాబు
  • కోవూరులో ప్రెస్ మీట్
  • సైకో అని జగన్ ను ఊరికే అనడంలేదని వ్యాఖ్యలు
  • జనాల బాధ జగన్ కు ఆనందంగా ఉందని విమర్శ  
Chandrababu warns YCP leaders

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నెల్లూరు జిల్లా కోవూరులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2022 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతున్నామని... బాదుడు, విద్వేషాలు, విషాదాలు, విధ్వంసాల సంవత్సరంగా ఈ ఏడాది మిగిలిపోయిందని తెలిపారు. అయితే 2023 పెనుమార్పులకు నాంది పలకబోతోందని అన్నారు.

ప్రభుత్వ విధానాల కారణంగా అన్ని వర్గాలు ఇబ్బందులు పడ్డాయని అన్నారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేసి, అక్రమంగా కేసులు పెట్టారని పేర్కొన్నారు. జగన్ ను సైకో అని ఊరికే అనడంలేదని. అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతుంటే జగన్, అతని టీం ఆనందం వ్యక్తం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. 

"దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు, కరెంట్ చార్జీలు మన రాష్ట్రంలోనే అధికంగా ఉన్నాయి. దేశంలో రైతులపై అత్యధిక అప్పున్న రాష్ట్రం ఏపీనే. ఒక్కో రైతుపై సగటున రూ.2.42 లక్షల అప్పు ఉంది. రాష్ట్రంలో అధికారికంగానే 1,673 మంది రైతుల అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారు. మనిషి అనే వాడు కనీసం ఆలోచిస్తాడు... కానీ ఈ ముఖ్యమంత్రి ఆలోచన కూడా చేయడం లేదు. రాష్ట్రంలో మద్యం రేట్లు పెరిగాయి కాబట్టి తాగలేక... మందుబాబులు గంజాయికి అలవాటు పడుతున్నారు. సీఎం ఎందుకు ఇంత తీవ్రమైన అంశంపై స్పందించడం లేదు?

మూడున్నరేళ్లలో రాష్ట్రంలో మహిళలపై 52 వేల దాడులు, వేధింపుల ఘటనలు జరిగాయి. మూడున్నరేళ్లలో 21 వేలమంది యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఉద్యోగాలు లేవు. ఐటీలో మేటిగా నాడు నిలిచిన యువత... నేడు నిస్సారంగా అయిపోయారు. స్కాలర్ షిప్ లు కొత్తగా వచ్చిన పథకమా? కానీ జగన్ దాన్ని కూడా పథకం అని చెపుతున్నాడు. వైసీపీలో ఎమ్మెల్యేలను చూడండి... నాడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఇప్పుడు కోట్లు కూడబెట్టారు. రాష్ట్రంలో ఎక్కడ లే అవుట్ వేసినా ఎమ్మెల్యేలకు వాటా ఇవ్వాల్సిందే. 

కందుకూరు ఘటనకు పోలీసు వైఫల్యం కారణం. అయితే దానికి కూడా ఈ సీఎం నన్ను తప్పు పడుతున్నాడు. దేశంలో జడ్జిలను బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తులు ఎక్కడైనా ఉన్నారా... ఆ పని కూడా ఈ వైసీపీ నేతలు చేశారు. నెల్లూరులో కోర్టులో ఫైళ్లు దొంగతనం చేసే స్థాయికి వచ్చారంటే ఏమనుకోవాలి? ఏప్రిల్ 11వ తేదీన మంత్రిగా కాకాణి ప్రమాణస్వీకారం చేస్తే... 13వ తేదీన కోర్టులో దొంగతనం చేసి ఫైళ్లు మాయం చేయించాడు. 

బాదుడే - బాదుడు అని ప్రారంభిచిన తరువాత జనంలో కదలిక వచ్చింది. పార్టీ కార్యక్రమాలు ప్రారంభించిన తరువాత ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చారు. సీఎం సభ పెడితే లబ్దిదారులను బెదిరించి సభలకు తరలిస్తున్నారు. జనం వెళ్లిపోతున్నారని ప్రాంగణం చుట్టూ కాలువలు తవ్వారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని ప్రజలు తమకు అన్వయించుకున్నారు. కార్యక్రమం అందుకే విజయవంతమైంది. నా జీవితంలో ఎప్పుడూ చూడనంతగా జనం తరలి వస్తున్నారు. జనంలో ఆందోళన, అభద్రతా భావం ఉంది. అందుకే మా సభలకు జనం తరలి వస్తున్నారు.ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది... వైసీపీ నేతలను హెచ్చరిస్తున్నా. 

వైసీపీలో ఉన్న నాయకులు సైతం ఆలోచనలో పడ్డారు. రాష్ట్రంపై గౌరవం ఉన్న నాయకులు వైసీపీలో కూడా ఇక కొనసాగలేరు. వారిలోనూ చర్చ మొదలైంది. స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసిన పార్టీలో వైసీపీ సర్పంచులు, ఎంపీటీ, జడ్పీటీసీలు ఎందుకు ఉండాలి? 

వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. ఎవరూ ఛాలెంజ్ చెయ్యరు అనుకున్న వాళ్లను ప్రజలే చాలెంజ్ చెయ్యడంతో వైసీపీలో కలవరపాటు మొదలైంది. ముందుస్తుపైనా జగన్ రెడ్డి ఆలోచనలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది" అంటూ వివరించారు.

  • Loading...

More Telugu News