Chandrababu: జగన్ నెల్లూరుకు వస్తే రైతులకు నేనేం చేశానో చెబుతా: కోవూరు సభలో చంద్రబాబు

  • చంద్రబాబు నెల్లూరు పర్యటన
  • కోవూరులో రోడ్ షో
  • రాష్ట్రంలో ఎవరూ ఆనందంగా లేరన్న చంద్రబాబు
  • ప్రజలను బానిసలుగా చూస్తున్నారని విమర్శలు
  • అన్నింటా బాదుడే బాదుడు అని వ్యాఖ్యలు
Chandrababu road show in Kovuru

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నెల్లూరు జిల్లా కోవూరులో రోడ్ షో నిర్వహించారు. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో ఎవరూ ఆనందంగా లేరని, ప్రజలను బానిసల్లా చూస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. అన్నింటా బాదుడే బాదుడు అని, నిత్యావసర వస్తువులు అందుబాటులో లేకుండా పోయాయని అన్నారు. వెనుకబడిన వర్గాలు, చేనేత కార్మికులు రోడ్లెక్కారని వెల్లడించారు. 

ఉద్యోగాలు రాలేదని, జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. డీఎస్సీ ప్రకటించలేదని, ఏ తమ్ముడికీ ఉద్యోగం రాలేదని తెలిపారు. రాష్ట్ర ప్రజల ఖర్మకు జగన్ రెడ్డే బాధ్యుడు అని స్పష్టం చేశారు. ఈ సీఎంకు సుపరిపాలన చేయడం తెలియదని, ఖర్చులు పెరిగి ప్రజలు అప్పులపాలయ్యారని పేర్కొన్నారు. చెత్తమీద పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయాలని పిలుపునిచ్చారు. వైసీపీని ఇంటికి పంపాలి... టీడీపీని గెలిపించుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఈ ముఖ్యమంత్రి అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఓ వైపు వరి, మరో వైపు ఆక్వా రంగం పరిస్థితి దిగజారిందని తెలిపారు. రాష్ట్రంలో కౌలుకు వచ్చేవారే లేరని పేర్కొన్నారు. సీఎం జగన్ కు చేతనైతే రైతుల సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే గద్దె దిగాలని స్పష్టం చేశారు. సీఎం జగన్ నెల్లూరుకు వస్తే రైతులకు తాను ఏంచేశానో చెబుతానని చంద్రబాబు సవాల్ విసిరారు. 

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించానని, వారికి ఐటీ అనే ఆయుధాన్ని ఇచ్చానని చెప్పారు. తాను లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువచ్చానని, 5.50 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. 

దగదర్తిలో ఎయిర్ పోర్టు ఏర్పాటు చేసి కృష్ణపట్నంలో ప్రత్యేకంగా ఇండస్ట్రీలు నెలకొల్పి తిరుపతి వరకు పారిశ్రామిక జోన్ ఏర్పాటు చేయాలని భావించానని వెల్లడించారు. ఓవైపు తిరుపతి ఎయిర్ పోర్టు, మరోవైపు చెన్నై ఎయిర్ పోర్టు, ఇక్కడ దగదర్తి ఎయిర్ పోర్టు... ఈ మూడు నగరాల నడుమ భారీ పారిశ్రామిక అభివృద్ధిని కలలు గన్నానని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. రాష్ట్రానికి వస్తున్న పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని తెలిపారు.

కొంపలు కూల్చే వ్యక్తి ఈ సీఎం అని విమర్శించారు. కృష్ణపట్నంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు సృష్టించి, వారిలో ఒకరిని రెచ్చగొట్టి దాన్ని వేరేవాళ్లకు రాయించాడని చంద్రబాబు ఆరోపించారు. 

"రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉంది. గూడూరులో సిలికా గనులు ఉన్నాయి. నేను సీఎంగా ఉన్నప్పుడు కొన్ని వందల మంది పారిశ్రామికవేత్తలు సిలికా వ్యాపారంలోకి వచ్చారు. నేనెప్పుడూ ఆ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. టన్నుకు రూ.800 నుంచి రూ.1,400 సంపాదించుకున్నారు. కానీ జగన్ వచ్చాడు... టన్నుకు వంద ఇస్తా... మొత్తం నాకే ఇవ్వాలంటూ అంతా దోచేసుకుంటున్నాడు. అక్కడ ఉండేవాళ్లంతా ఆయన సామాజిక వర్గమే. ఎక్కువమంది ఆయన మనుషులే. ఎక్కడైనా మామా అను గానీ వంకాయ చెట్టు దగ్గర మాత్రం కాదంటూ మొత్తం డబ్బంతా వసూలు చేసుకుంటున్నాడు. 

రాష్ట్రంలో ఆస్తులన్నీ ఆయనకే కావాలి. మద్యం వ్యాపారంలోనూ ఇంతే. రాష్ట్రంలో మందుబాబులకు నేనే గుర్తొస్తుంటాను. రాష్ట్రంలో నాణ్యమైన మద్యం, తక్కువ రేట్లకే అందించాం కాబట్టే మందుబాబులు మద్యం తాగేటప్పుడు నన్ను తలుచుకుంటారు. 

రాష్ట్రంలో మద్యం రేట్లు ఎందుకు పెరిగాయి? మద్యం డిస్టిలరీలు ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాయి? జగన్ రెడ్డి అధీనంలోనే ఉన్నాయి. ఏనాడైనా మద్యం షాపుల్లో ఆన్ లైన్ పేమెంట్ ఉందా? బిల్లులు ఇస్తున్నారా? దీని వెనుక చిదంబర రహస్యం ఏంటో తెలుసా? సాయంత్రానికి ఆ డబ్బంతా తాడేపల్లి నకిలీ ప్యాలెస్ కు చేరుతుంది. దీనిపై ప్రజల్లో ఆగ్రహం రాకపోయినా ఫర్వాలేదు కానీ చైతన్యం రావాలి. 

పెన్నా నదిలో ఇసుక కావాల్సినంత ఉన్నా కోవూరుకు ఇసుక వస్తోందా? ఒకప్పుడు ఉచితంగా తెచ్చుకున్న ఇసుక ఇప్పుడు దొరకడంలేదు. మన ఇసుక పక్క రాష్ట్రాల్లో దొరుకుతోంది. సిమెంటు కూడా దొరకడంలేదు. కొంటే భారతి సిమెంటే కొనాలి... అది కూడా సిండికేట్ రేట్లకే కొనాలి. ఒక్క జగన్ మోహన్ రెడ్డి తప్ప రాష్ట్రంలో ఎవరైనా బతికే పరిస్థితి ఉందా? భవిష్యత్తులో ప్రజలకు చెందాల్సిన సంపదను జగన్ దోచుకెళుతున్నాడు. 

అదేమని అడిగితే పోలీసులు గోడలు దూకి వస్తారు. పాపం పోలీసులు ఏంచేస్తారు... వాళ్ల మెడమీద కూడా కత్తి పెట్టాడు. మాట వినకపోతే రిజర్వ్ అంటాడు... రిజర్వ్ కు పోతే జీతాలు ఉండవు. జీతం లేకపోతే పరువు పోతుంది. దాంతో వాళ్లు కూడా లొంగిపోయారు. నేను సీఎంగా ఉన్నప్పుడు పోలీసులకు ఎంతో గౌరవం ఉండేది. ఇప్పుడీ సైకో పాలనలో పోలీసులకు గౌరవంలేదు. పోలీసులతో, వాలంటీర్లతో భయపెట్టాలని చూస్తున్నాడు'' అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

సంక్షేమం తానే చేశానని జగన్ చెప్పుకుంటున్నాడని, కానీ సంక్షేమం అంటే టీడీపీ అని గుర్తించాలని, నాడు ఎన్టీఆర్ చేసిన పనులు ఇప్పటికీ దేశానికి ఆదర్శంగా నిలిచాయని చంద్రబాబు స్పష్టం చేశారు.

More Telugu News