Chandrababu: దగదర్తి విమానాశ్రయ భూములను పరిశీలించిన చంద్రబాబు

  • నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • దగదర్తి ఎయిర్ పోర్టుకు భూములు ఇచ్చిన రైతులతో మాటామంతీ
  • తమకు పరిహారం నిలిపివేశారన్న రైతులు
  • చంద్రబాబు ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్న వైనం 
Chandrababu visits Dagadarthi airport lands

నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జిల్లాలోని దగదర్తి విమానాశ్రయ భూముల్ని పరిశీలించారు. ఎయిర్ పోర్టు కోసం భూములు ఇచ్చిన రైతులతో మాట్లాడారు. 

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తమకు రావాల్సిన పరిహారం నిలిపివేసినట్లు రైతులు చంద్రబాబుకు వివరించారు. దీంతో ఏంచేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడిందని రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఎయిర్ పోర్టు తరలింపు వార్తలు తమని కలవరపరుస్తున్నాయని భూములిచ్చిన రైతులు చంద్రబాబు దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు.  

ఈ క్రమంలో వారితో మాట్లాడిన చంద్రబాబు... జగన్మోహన్ రెడ్డి చేసిన దగాలో దగదర్తి విమానాశ్రయం కూడా ఓ భాగం అని అన్నారు. రామాయపట్నం పోర్టు ఎందుకు రద్దు చేశారో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని నిలదీశారు. షన్జెన్ తో సమానంగా పారిశ్రామిక హబ్ గా తయారయ్యే ప్రాంతాన్ని నాశనం చేసినట్లు పేర్కొన్నారు. పోర్టులెందుకు మార్చారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. 

కృష్ణపట్నం పోర్టులో అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి కొంపలు కూల్చే కార్యక్రమానికి జగన్ రెడ్డి శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. రామాయపట్నంలో ఏర్పాటు కావాల్సిన ఏషియన్ పల్ప్ ఇండస్ట్రీని జగన్మోహన్ రెడ్డి తరిమేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News