Aung San Suu Kyi: ఆంగ్ సాన్ సూకీకి మరో కేసులో ఏడేళ్ల జైలుశిక్ష విధించిన మయన్మార్ కోర్టు

  • గతేడాది మయన్మార్ లో తిరుగుబాటు
  • ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూల్చివేసిన సైన్యం
  • పాత కేసులు తిరగదోడుతున్న వైనం
  • ఇప్పటికే సూకీకి 26 ఏళ్ల జైలు శిక్ష
  • తాజా తీర్పుతో 33 ఏళ్లకు పెరిగిన జైలుశిక్ష 
Aung San Suu Kyi faced another seven year jail term

మయన్మార్ మాజీ పాలకురాలు ఆంగ్ సాన్ సూకీని సైనిక పాలకులు ఏమాత్రం కరుణించడంలేదు. పాత కేసులు తిరగదోడి మరీ సూకీని జైలుకే పరిమితం చేస్తున్నారు. ఇప్పటికే పలు కేసుల్లో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆంగ్ సాన్ సూకీ... తాజాగా మరో కేసులో జైలుశిక్షకు గురయ్యారు. 

ఆమె అధికారంలో ఉన్నప్పుడు ఓ హెలికాప్టర్ ను లీజుకు తీసుకునే సమయంలో అవినీతికి పాల్పడ్డారని సైనిక ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ కేసులో ఆంగ్ సాన్ సూకీని మయన్మార్ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఆమెకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. 

ఇప్పటివరకు ఆంగ్ సాన్ సూకీకి పలు కేసుల్లో 26 ఏళ్ల జైలుశిక్ష విధించారు. ఆమె వద్ద వాకీటాకీ ఉందని, కరోనా నిబంధనలు పాటించలేదని, దేశద్రోహం, ఎన్నికల్లో అక్రమాలు, అవినీతి వంటి పలు కేసులు ఉన్నాయి. తాజా కేసుతో కలిపి ఆమె జైలుశిక్ష 33 ఏళ్లకు పెరిగింది. 

గతేడాది ఫిబ్రవరిలో ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైనా, ఆ ప్రభుత్వాన్ని కూల్చివేసిన సైన్యం పాలనా పగ్గాలను తన చేతుల్లోకి తీసుకుంది. తిరుగుబాటు సందర్భంగా ఆంగ్ సాన్ సూకీని అరెస్ట్ చేసింది.

More Telugu News