Rishabh Pant: క్రికెటర్ పంత్ ను రక్షించిన బస్ డ్రైవర్.. లేకపోతే సజీవదహనం అయిపోయేవాడే!

  • రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పంత్
  • పంత్ ను రక్షించిన బస్సు డ్రైవర్, బస్సులోని ప్రయాణికులు
  • కారు నుంచి పంత్ ను వెలికి తీసిన వైనం
Bus driver saved Rishabh pant

ఘోర రోడ్డు ప్రమాదం నుంచి టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న బెంజ్ కారు డివైడర్ కు ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయడ్డాడు. కారు పూర్తిగా దగ్ధమయింది. ప్రస్తుతం పంత్ డెహ్రాడూన్ లో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు పంత్ కారుకు ప్రమాదం జరగిన వెంటనే ఆయనను రక్షించిన వారిలో హర్యానా రోడ్ వేస్ కు చెందిన బస్ డ్రైవర్ కూడా ఉన్నాడు. 

ఏం జరిగిందో బస్ డ్రైవర్ సుశీల్ మాన్ వివరించారు. ఎదురుగా చాలా వేగంతో వస్తున్న కారు డివైడర్ ను ఢీకొందని సుశీల్ మాన్ తెలిపాడు. వెంటనే తాను బస్సును రోడ్డు పక్కన ఆపేసి కారు దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లానని చెప్పాడు. వాస్తవానికి పల్టీలు కొట్టుకుంటూ వచ్చిన కారు బస్సు కిందకు దూరుతుందని భావించానని, అయితే కారు ఆగిపోయిందని తెలిపారు. కిటికీ నుంచి డ్రైవర్ (పంత్) శరీరం సగం బయటకు వచ్చిందని... తాను క్రికెటర్ అని ఆయన చెప్పాడని... తన తల్లికి ఫోన్ చేయమని తనను కోరాడని, కానీ ఆయన ఫోన్ స్విచాఫ్ అయిపోయిందని చెప్పాడు. 

తాను క్రికెట్ చూడనని, పంత్ అంటే ఎవరో తనకు తెలియదని అన్నాడు. అయితే తన బస్సులో ఉన్నవారు అతన్ని గుర్తించారని చెప్పాడు. వెంటనే పంత్ ను కారులో నుంచి బయటకు తీశామని... కారులో ఇంకా ఎవరైనా వున్నారేమోనని వెతికానని... ఒక బ్లూ బ్యాగ్ ను, రూ. 7 నుంచి 8 వేల డబ్బును కారు నుంచి తీశానని... అంబులెన్సులోకి ఎక్కించిన తర్వాత వాటిని ఆయనకు (పంత్) ఇచ్చానని తెలిపాడు. ప్రమాద సమయానికి బస్సు అక్కడకు రావడం, కారు నుంచి బయటకు లాగడంతో పంత్ ప్రాణాలతో బయటపడ్డారు. లేకపోతే దగ్ధమైపోయిన కారుతో పాటు ఆయన సజీవదహనం అయిపోయేవాడు.

More Telugu News