Marion Biotech: మారియన్ బయోటెక్ లో అన్ని ఔషధాల ఉత్పత్తికి బ్రేక్

Marion Biotech cough syrup makers linked to Uzbek deaths halts all production
  • సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు
  • అనంతరం నిలిచిపోయిన ఉత్పత్తి
  • పరీక్షల ఫలితాల ఆధారంగా కంపెనీపై చర్యలకు అవకాశం
ఉజ్బెకిస్థాన్ లో 19 మంది చిన్నారుల మరణాలకు కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న నోయిడా ఫార్మా కంపెనీ మారియన్ బయోటెక్ లో ఉత్పత్తి నిలిచిపోయింది. కేవలం దగ్గు మందులే కాకుండా అన్ని రకాల మందుల ఉత్పత్తిని కంపెనీ ప్లాంట్ లో నిలిపివేశారు. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ సీవో) మారియన్ బయోటెక్ ప్లాంట్ ను తనిఖీ చేసినట్టు, తయారీ కార్యకలాపాలను నిలిపివేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ ట్విట్టర్ లో ప్రకటించారు.

కంపెనీ ఫ్యాక్టరీ తనిఖీ చేశారని, ఉత్పత్తిని ఆపేసినట్టు మారియన్ బయోటెక్ లీగల్ హెడ్ హసన్ హారిస్ కూడా ప్రకటించారు. ఘటనకు సంబంధించి నివేదికల కోసం చూస్తున్నట్టు చెప్పారు. మారియన్ బయోటెక్ కు చెందిన డాక్-1 అనే దగ్గు మందును వైద్యుల సూచన లేకుండా తీసుకున్న చిన్నారులు 19 మంది  మరణించినట్టు ఉజ్బెకిస్థాన్ ప్రకటించింది. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ, ఔషధ నియంత్రణ, ప్రమాణాల మండళ్లు స్పందించాయి. 

డాక్-1 దగ్గు మందు శాంపిళ్లను రీజినల్ డ్రగ్ లేబరేటరీకి పంపించినట్టు మాండవీయ లోగడ ప్రకటించడం గమనార్హం. పరీక్షా ఫలితాల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. 
Marion Biotech
cough syrup
production
stopped
Uzbek deaths

More Telugu News