railway: సంక్రాంతికి మరో 30 ప్రత్యేక రైళ్లు

  • సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు పెంచిన రైల్వే
  • సికింద్రాబాద్ నుంచి ఆంధ్రాలో పలు నగరాలకు రాకపోకలు
  • జనవరి 1 నుంచి 20 వరకు నడిచే ఈ రైళ్లకు 31 తేదీ నుంచి రిజర్వేషన్ చేసుకోవచ్చని రైల్వే శాఖ వెల్లడి
  • దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ వో ప్రకటన 
30 special trains for sankranthi season

సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం సికింద్రాబాద్ నుంచి అదనంగా 30 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ సహా నాంపల్లి, కాచిగూడ, వికారాబాద్ ల నుంచి నర్సాపూర్, మచిలీపట్నం, కాకినాడ నగరాలకు వీటిని నడపనున్నట్లు పేర్కొంది. పండగ రద్దీ నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన ప్రత్యేక రైళ్లకు ఇవి అదనమని వివరించింది. ఈ రైళ్లు జనవరి 1 నుంచి జనవరి 20 వరకు ఆయా నగరాల మధ్య పరుగులు పెడతాయని తెలిపింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ వో సీహెచ్. రాకేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

సికింద్రాబాద్, హైదరాబాద్ ల నుంచి రాత్రిపూట బయలుదేరి ఉదయానికి గమ్యస్థానం చేరుకునేలా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయని రాకేశ్ తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లలో జనరల్, రిజర్వ్ డ్ బోగీలు ఉంటాయని వివరించారు. కాగా, సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే 94 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తాజాగా ప్రకటించిన వాటితో కలిపి సంక్రాంతికి మొత్తం 124 ప్రత్యేక రైళ్లు జనవరి 1 నుంచి 20 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లకు ఈ నెల 31 నుంచి రిజర్వేషన్ సదుపాయం కల్పించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

More Telugu News