Pele: బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే కన్నుమూత

Pele one of the greatest of all time passes away
  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పీలే
  • 82 ఏళ్ల వయసులో కన్నుమూత
  • ప్రపంచంలోనే అత్యుత్తమ సాకర్ ఆటగాడిగా గుర్తింపు
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఇక లేరు. ఆయన పూర్తి పేరు ఎడ్సన్ అరాంట్స్ డో నాసిమియాంటో. గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన 82 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఇటీవల ఆరోగ్యం క్షీణించడంతో సావోపాలోలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో గత అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. రెండు దశాబ్దాలపాటు సాకర్ అభిమానులను ఉర్రూతలూగించిన పీలే.. మూడు ప్రపంచకప్ విజయాల్లో భాగస్వామి అయిన ఏకైక ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 

ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. నాలుగు ప్రపంచకప్‌లలో దేశానికి ప్రాతినిధ్యం వహించిన పీలే 1958, 1962, 1970లలో ప్రపంచకప్‌లు అందుకున్నాడు. ప్రత్యర్థి వ్యూహాలను పసిగట్టి మెరుపు వేగంతో బంతిని గోల్‌పోస్టులోకి నెట్టడంలో పీలేకి మించినవారు లేరు. 1966లో ఆటకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నా, మళ్లీ జట్టులోకి వచ్చి 1970 ప్రపంచకప్‌లో ఉత్తమ ఆటగాడిగా బంగారు బంతి అందుకున్నాడు. 1971లో యుగోస్లేవియాతో చేరి చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ప్రపంచకప్‌లలో 14 మ్యాచుల్లో 12 గోల్స్ సాధించాడు.

పీలే మృతికి సాకర్ ప్రపంచం నివాళులు అర్పిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులతోపాటు క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు పీలేకు నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Pele
Brazil
Soccer

More Telugu News