HDL cholesterol: మంచి కొలెస్ట్రాల్ ను పెంచుకునే మార్గాలు ఇవిగో..!

  • వ్యాయామం మెరుగైన మార్గం
  • ట్రాన్స్ ఫ్యాట్ ఉన్నవి తినకూడదు
  • శాచురేటెడ్ ఫ్యాట్ పదార్థాలను తగ్గించుకోవాలి
  • ఒత్తిడికి దూరంగా ఉండాలి
HDL cholesterol How to boost your good cholesterol

కొలెస్ట్రాల్ (కొవ్వు) అన్నది మైనం వంటి పదార్థం. మన శరీరం అంతటా కణజాలంలో ఉండేది ఈ కొవ్వులే. తీసుకునే ఆహారం, కాలేయం నుంచి రక్తంలోకి కొవ్వులు చేరుతుంటాయి. కొలెస్ట్రాల్ లో రెండు ముఖ్యమైన వాటి గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఒకటి లో డెన్సిటీ లిపో ప్రొటీన్ (ఎల్డీఎల్). దీన్నే చెడు, హానికారక కొలెస్ట్రాల్ గా చెబుతారు. మరొకటి హై డెన్సిటీ లిపో ప్రొటీన్ (హెచ్ డీఎల్). ఇది మంచి కొలెస్ట్రాల్. 

ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ మోతాదు ఎక్కువైతే అది రక్తనాళాల గోడలపై పేరుకుపోతూ, చివరికి ప్రవాహ మార్గం మూసుకుపోవడానికి కారణం అవుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది క్లాట్ కు దారితీస్తుంది. అదే జరిగితే స్ట్రోక్ వస్తుంది. 

ఈ రిస్క్ ను హెచ్ డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఎలా అంటే అధికంగా ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తిరిగి కాలేయానికి పంపిస్తుంది. అక్కడి నుంచి అది బయటకు పంపడం జరుగుతుంది. కనుక ఎల్డీఎల్ తగ్గించుకుని, హెచ్ డీఎల్ ను పెంచుకున్నట్టయితే గుండె జబ్బులు, స్ట్రోక్ రిస్క్ తగ్గిపోతుంది. 

లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ద్వారా ఈ కొలెస్ట్రాల్ స్థాయులను తెలుసుకోవచ్చు. ఎల్డీఎల్ ఎక్కువగా ఉండి, హెచ్ డీఎల్ తక్కువగా ఉండే వారికి వైద్యులు జీవనశైలి, ఆహారపరమైన మార్పులు సూచిస్తారు. వాటిని అనుసరించడం ఎంతైనా అవసరం. అలా చేయలేని వారికి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే ఔషధాలను సూచిస్తుంటారు. 

ఎంతుండాలి.. ఎలా పెంచుకోవాలి?
మంచి కొలెస్ట్రాల్ అనేది ఒక డెసిలీటర్ కు గాను 60 ఎంజీ అంతకంటే ఎక్కువ ఉండాలి. పురుషుల్లో 40 కంటే, స్త్రీలలో 50 కంటే తక్కువ ఉంటే వారికి రిస్క్ ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. జీవక్రియల సమస్యలు కలిగిన వారిలో హెచ్ డీఎల్ సహజంగా తక్కువే ఉంటుంది. స్థూల కాయం, రక్తపోటు, అధిక మధుమేహం ఇలాంటి వారిలోనూ ఇదే పరిస్థితి చూడొచ్చు. 

నిత్యం వ్యాయామం చేయడం ద్వారా మంచి కొలెస్ట్రాల్ ను పెంచుకోవచ్చు. అన్నింటికంటే ఉత్తమమైన మార్గం ఇది. అధిక బరువు ఉంటే దాన్ని తగ్గించుకోవాలి. ఏరోబిక్ వ్యాయామాలు మంచి ఫలితాన్నిస్తాయి. ఒక గంట పాటు వీటిని చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ట్రాన్స్ ఫ్యాట్ ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు. రెడీ టూ ఈట్, ఇతర తినే ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఏవైనా, వాటిపై న్యూట్రిషన్ సమాచారాన్ని పరిశీలిస్తే అందులో ఏమున్నాయనేది తెలుస్తుంది. ఫైబర్ ఉండే ఆహారం, పండ్లు, కూరగాయలు, నట్స్ మంచివి.

ట్రాన్స్ ఫ్యాట్ ఉండే పదార్థాలతో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. కేక్ లు, కుకీల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. వేపుళ్లు, బయట హోటళ్లు, బండ్లపై మళ్లీ మళ్లీ కాచే నూనెతో చేసిన ఆహారాల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ విషమ స్థాయిలో ఉంటాయి. అలాగే శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నవి కూడా చాలా వరకు తగ్గించుకోవాలి. ఫుల్ క్రీమ్ పాలలో ఇది ఎక్కువగా ఉంటుంది. పొగతాగే అలవాటు ఉంటే మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మితిమీరిన ఆల్కహాల్ వల్ల చెడు కొలెస్ట్రాల్, ముఖ్యంగా ట్రైగ్లిజరైడ్స్ (ఇది కూడా హానికారక కొవ్వు పదార్థమే) పెరుగుతాయి. అధిక ఒత్తిడుల వల్ల కూడా ఎల్డీఎల్ పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయి. కనుక ఒత్తిడిని తగ్గించుకోవాలి.

More Telugu News