Australia: ఆస్ట్రేలియాకు భారీ విజయం.. భారత్ కు కలిసొచ్చిన వైనం!

  • రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 182  పరుగుల తేడాతో చిత్తు
  • 2–0తో సిరీస్ సొంతం చేసుకున్న ఆసీస్
  • డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఆసీస్, భారత్
Australia crush South Africa by an innings and 182 runs in 2nd Test

సొంతగడ్డపై ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తిరుగులేని ఆధిపత్యం చూపెట్టింది. వరుసగా రెండో టెస్టులోనూ దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించి మూడు మ్యాచ్ ల సిరీస్ ను మరొకటి మిగిలుండగానే 2–0తో సొంతం చేసుకుంది. మరోవైపు తొలి టెస్టులో రెండు రోజుల్లోనే చిత్తయిన దక్షిణాఫ్రికా.. రెండో టెస్టులోనూ పేలవంగా ఆడింది. మూడున్నర రోజుల్లో ముగిసిన రెండో మ్యాచ్ లో ఇన్నింగ్స్ 182 పరుగుల తేడాతో మరో ఘోర ఓటమి మూటగట్టుకుంది. భారీ లోటుతో ఓవర్ నైట్ స్కోరు 15/1తో గురువారం ఆట కొనసాగించిన సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్ లో 204 పరుగులకే కుప్పకూలింది. టెంబా బవుమా (65) టాప్ స్కోరర్ గా నిలిచాడు. వెరెన్ (33), డి బ్రయన్ (28), సరెల్ ఎర్వీ (21) కాసేపు పోరాడారు. 

ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లైయన్ మూడు వికెట్లు, స్కాట్ బోలాండ్ రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 189 పరుగులకు ఆలౌట్ అవ్వగా, ఆస్ట్రేలియా 575/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. వార్నర్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. 

ఈ విజయంతో  ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా తన అగ్రస్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. ఇది రెండో స్థానంలో ఉన్న భారత్ కు పరోక్షంగా ఉపయుక్తం కానుంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు వచ్చే జూన్ లో లండన్ లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ కు అర్హత సాధిస్తాయి.

More Telugu News