Anam Ramanarayana Reddy: ప్రజలు ప్రస్తుతం నన్ను కూడా నమ్మే పరిస్థితి లేదు: వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి

  • వాలంటీర్లు, కన్వీనర్లతో ఆనం సమావేశం
  • రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేకపోతున్నామని వెల్లడి
  • ప్రజల వద్దకు ఎలా వెళ్లగలమని ఆవేదన
  • వైఎస్సార్ కల నెరవేర్చలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని వ్యాఖ్యలు
YCP MLA Anam Ramanarayana Reddy comments on development works

నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వాలంటీర్లు, కన్వీనర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాగడానికి నీళ్లు లేవని, రోడ్లపై గుంతలు పూడ్చలేకపోతున్నామని తెలిపారు. నాలుగేళ్లలో ఏం పనిచేశామని ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతాం? అని ఆనం వ్యాఖ్యానించారు. 

కండలేరు రిజర్వాయర్ దగ్గరే ఉన్నా రాపూరులో ఒక్క చెరువులో నీళ్లు నింపలేకపోయామని పేర్కొన్నారు. కండలేరు అభివృద్ధి విషయంలో వైఎస్సార్ కల నెరవేర్చలేకపోయామని ఆనం విచారం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కలను నెరవేర్చలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం అంటూ తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. 

ఎస్ఎస్ కెనాల్ కడతామని ఎన్నికల వేళ హామీ ఇచ్చామని, ఇన్నేళ్లయినా కెనాల్ గురించి పట్టించుకోలేదని అన్నారు. గ్రామాల్లో ప్రజలకు బిందెడు నీళ్లు ఇవ్వలేని స్థితిలో ఉన్నామని, ఎస్ఎస్ కెనాల్ గురించి ముఖ్యమంత్రికి ఎన్నోసార్లు చెప్పామని, అసెంబ్లీలోనూ ప్రస్తావించామని, చీఫ్ ఇంజినీర్ల భేటీలోనూ ప్రస్తావించామని ఆనం వెల్లడించారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఎస్ఎస్ కెనాల్ పరిస్థితి ముందుకు కదల్లేదని పేర్కొన్నారు. 

ఒక అపనమ్మక వ్యవస్థలో పనిచేస్తున్నామని తెలిపారు. కంటి ముందు నీళ్లున్నాయని సంతోషపడడమే తప్ప నీళ్లు తాగలేని పరిస్థితి అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రజలు తనను కూడా నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇక్కడి నీళ్లు తాగగలమనే నమ్మకం ప్రజల్లో పోయిందని ఆనం రామనారాయణరెడ్డి వివరించారు. 

"ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వాన్ని బాగా విమర్శించాం... ఇప్పుడు అధికారంలో ఉండి మనమేం చేస్తున్నాం? పనులను ముందుకు తీసుకెళ్లని మనల్ని ప్రజలు నమ్ముతారా? ఏం చేశారని ప్రజలు అడిగితే ఏం చెప్పాలో తెలియడంలేదు" అని ఆనం వాపోయారు.

More Telugu News