President Of India: హైదరాబాద్‌ సాంస్కృతిక వారసత్వం గొప్పది: రాష్ట్రపతి ముర్ము

  • విలువలతో కూడిన విద్యావ్యవస్థకు, సాంస్కృతిక సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్న రాష్ట్రపతి
  • హైదరాబాద్ లోని కేశవ్ మెమోరియల్ విద్యార్థులతో ముచ్చటించిన ముర్ము
  • దేశ నిర్మాణానికి విద్య పునాది అని వ్యాఖ్య
Hyderabad is a city with a rich cultural heritage says president murmu

విలువలతో కూడిన విద్యావ్యవస్ధకు, సాంస్కృతిక విలువల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విద్యార్ధులకు సూచించారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి మంగళవారం నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థల సొసైటీ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్ధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. విద్య అనేది దేశ నిర్మాణానికి పునాది అని, ప్రతి వ్యక్తి పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడానికి ఇది కీలకం అని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మహిళలు చదువులో రాణించాలన్నారు. ఒక మహిళ విద్యనభ్యసిస్తే మొత్తం కుటుంబాన్ని విద్యావంతులను చేస్తారన్న మహాత్మాగాంధీ మాటలను రాష్ట్రపతి గుర్తు చేశారు. 

బాలికలకు విద్య, అవకాశాలలో సమాన ప్రవేశం కల్పించినప్పుడు వారు అబ్బాయిల కంటే ఎక్కువ సాధించారని ముర్ము చెప్పారు. ఇక మన పూర్వీకులు వేసిన పునాదులపై మన దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లేలా చూడాల్సిన బాధ్యత భారతదేశంలోని యువకులందరికీ ఉందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ కు గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉందని రాష్ట్రపతి అన్నారు.

‘గొప్ప సాంస్కృతిక వారసత్వం, విభిన్న జనాభా కలిగిన నగరం హైదరాబాద్ . ఇది విభిన్న ఆలోచనలు, దృక్కోణాల సమ్మేళనంగా మారిపోయింది. ఈ వైవిధ్యమే హైదరాబాద్ ప్రధాన బలం. అభివృద్ధికి కేంద్రంగా నగరం విజయానికి దోహదపడింది’ అని అభిప్రాయపడ్డారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా హైదరాబాద్ విమోచన 75వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

More Telugu News