ఉప్పొంగుతున్న లావాకు సమీపంగా వెళ్లిన యువకుడు.. వీడియో ఇదిగో!

  • ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా సాహసం చేసిన వైనం
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
  • ఎందుకీ పిచ్చి పనంటూ చివాట్లు పెడుతున్న నెటిజన్లు
Man Stands At The Edge Of A Lava Ocean In Hair Raising Video

అగ్ని పర్వతాలు లావా వెదజల్లడం ఇంటర్నెట్ లో చూస్తుంటాం.. అత్యంత వేడిగా ఉండే ఈ లావా ప్రవాహంలా కిందకు సాగుతుంది. తోవలో ఉన్న వాటిని మాడ్చి మసి చేస్తుంది. అలాంటి ప్రమాదకరమైన లావా ప్రవాహానికి అతి దగ్గరగా వెళ్లాడో యువకుడు. సముద్ర తీరంలో కొండరాళ్లపైకి ఎగిసిపడే నీళ్లలాగా పైకి ఉబుకుతున్న లావాకు అత్యంత సమీపంలోకి వెళ్లాడు. తను చేస్తున్న ఈ సాహసాన్ని వీడియో తీసి ట్విట్టర్ లో పెట్టాడు. వేడిని తట్టుకోవడానికి ఎలాంటి రక్షణ కవచాలు ధరించకుండా కేవలం ప్యాంటు షర్టు, నెత్తిన ఓ క్యాప్ తో ఆ యువకుడు లావా దగ్గరగా వెళ్లడం వీడియోలో కనిపిస్తోంది.

సముద్రం అలల్లాగా ఎగిసిపడుతున్న లావాను ఒడ్డు నుంచి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? అంటూ క్యాప్షన్ పెట్టి ఈ వీడియోను ట్విట్టర్ లో పెట్టాడు. ఈ నెల 24 న ‘ఓడ్ లీ టెర్రిఫైయింగ్’ యూజర్ నేమ్ తో ట్వీట్ చేసిన ఈ వీడియోలో మిగతా వివరాలను వెల్లడించలేదు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు.. ఎందుకు ఈ పని చేశాడనే వివరాలనూ చెప్పలేదు. ఈ వీడియోను లక్షలాది మంది చూడగా.. వేలాది మంది కామెంట్లు పెట్టారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా లావాకు అంత దగ్గరగా వెళ్లడం బుద్ధిలేని పనంటూ కొందరు నెటిజన్లు చివాట్లు పెట్టారు. అది ఫేక్ వీడియో అయి ఉండొచ్చని, అత్యంత వేడిగా ఉండే లావా ప్రవాహానికి అంత దగ్గరగా వెళ్లడం అసాధ్యమని మరికొందరు కామెంట్ చేశారు.

More Telugu News