Uddhav Thackeray: కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదంపై ఉద్ధవ్ థాకరే కీలక వ్యాఖ్యలు

  • మహారాష్ట్ర-కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం
  • వివాదాస్పద సరిహద్దు గ్రామాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించాలన్న ఉద్ధవ్
  • ఇంత జరుగుతున్నా సీఎం షిండే పెదవి విప్పడం లేదని విమర్శ
Bring disputed area under central rule asks Uddhav Thackeray

మహారాష్ట్ర-కర్ణాటక మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కీలక వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పదంగా మారిన సరిహద్దు ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని, అప్పుడే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. విధాన మండలిలో నిన్న ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక-మహారాష్ట్ర మధ్య నెలకొన్నది భాష, సరిహద్దు వివాదం మాత్రమే కాదని, మానవత్వానికి సంబంధించిన సమస్య అని అన్నారు. మరాఠీ మాట్లాడే ప్రజలు తరతరాలుగా సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్నారని అన్నారు. ఈ అంశం ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగులో ఉందన్నారు.

రెండు రాష్ట్రాల మధ్య ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో చెప్పలేదని అన్నారు. యథాతథ స్థితిని కొనసాగించాల్సిన గ్రామాల్లో ఎవరు చిచ్చుపెడుతున్నారని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలకు సంరక్షకుడిగా వ్యవహరించాల్సిన కేంద్రం ఏం చేస్తోందని ఉద్ధవ్ నిలదీశారు. తామైతే కేంద్రం సంరక్షక పాత్ర పోషించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఉభయ సభల సభ్యులు ‘కేస్ ఫర్ జస్టిస్’ సినిమాను వీక్షించాలని, మహాజన్ కమిషన్ నివేదికను అధ్యయనం చేయాలని ఉద్ధవ్ సూచించారు.

కర్ణాటకలోని బెళగావి మునిసిపల్ కార్పొరేషన్ తమను మహారాష్ట్రలో కలిపేయాలని తీర్మానం చేస్తే అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని ఉద్ధవ్ గుర్తు చేశారు. మహారాష్ట్రలోని కొన్ని గ్రామ పంచాయతీలు తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకునే సాహసాన్ని షిండే ప్రభుత్వం చేయలేకపోయిందని విమర్శించారు.

More Telugu News