5G services: విమానాశ్రయాలకు సమీపంలో 5జీ సేవలు ఇప్పట్లో లేనట్టే!

near Airports may not be able to get 5G support anytime soon
  • విమాన రేడియో ఆల్టీమీటర్లకు 5జీ రేడియో తరంగాలతో ఆటంకం
  • 2 కిలోమీటర్ల పరిధి వరకు 5జీ బేస్ స్టేషన్లను ఏర్పాటు చేయవద్దని ఆదేశం
  • విమానాల్లో ఆల్టీమీటర్లను మార్చేంత వరకు ఇదే పరిస్థితి
అవును, విమానాశ్రయాలకు సమీపంలో ఉండే వారికి 5జీ సేవలు ఇప్పట్లో అందే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఎయిర్ పోర్ట్ లకు సమీపంలో 5జీ బేస్ స్టేషన్లను ఏర్పాటు చేయవద్దంటూ టెలికం ఆపరేటర్లు అందరినీ టెలికం శాఖ తాజాగా ఆదేశించింది. సీ బ్యాండ్ 5జీ బేస్ స్టేషన్లను అన్ని విమానాశ్రయాలకు సమీపంలో 2.1 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేయవద్దని కోరుతూ టెలికం ఆపరేటర్లకు టెలికం శాఖ ఒక లేఖ రాసింది. 

టెలికం సర్వీస్ ప్రొవైడర్లు విమానాశ్రయం రన్ వే ముగింపు నుంచి 2100 మీటర్ల వరకు, రన్ వే సెంటర్ లైన్ నుంచి 910 మీటర్ల వరకు.. ఎలాంటి 5జీ/ఐఎంటీ బేస్ స్టేషన్లను 3300-3670 మెగాహెర్జ్ బ్యాండ్ లో ఏర్పాటు చేయవద్దని ఆదేశించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్  (డీజీసీఏ) పాత విమానాల్లో రేడియో ఆల్టీమీటర్లను మార్చేంత వరకు తాజా ఆదేశాలు అమల్లో ఉంటాయని టెలికం శాఖ పేర్కొంది. 

తాజా ఆదేశాలతో విమానాశ్రయాలకు 2 కిలోమీటర్ల లోపు ఉండే వారికి 5జీ సేవలు అందకుండా పోతాయి. అంతేకాదు, విమానాల్లో రేడియో ఆల్టీమీటర్లు మార్చేందుకు చాలా సమయమే పట్టొచ్చు. దీంతో 2023లోనూ ఆయా ప్రాంతాల్లోని వారికి సేవలు అందడం అనుమానమేనని తెలుస్తోంది. సీబ్యాండ్ లోని 5జీ రేడియో తరంగాలు.. విమానాల రేడియో ఆల్టీమీటర్లపై ప్రభావం చూపిస్తుండడమే సమస్యకు కారణం. ప్రమాదాలు జరుగుతాయన్న ఆందోళనతో, ముందస్తు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నట్టు తెలుస్తోంది.
5G services
near airports
stopped
telecom department
directs

More Telugu News