China: చైనా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా.. జినోమ్ సీక్వెన్సింగ్‌కు నమూనాలు

China returnee tests Covid positive in Agra and sample sent for genome sequencing
  • చైనాలో పనిచేస్తూ ఆగ్రా చేరుకున్న వ్యక్తికి కరోనా సోకినట్టు నిర్ధారణ
  • లక్షణాలు లేవన్న చీఫ్ మెడికల్ ఆఫీసర్
  • అతడికి సోకింది ఎలాంటి వేరియంటో తెలుసుకునేందుకు నమూనాల సేకరణ
  • విదేశీ పర్యాటకులకు ఎక్కడికక్కడే కొవిడ్ స్క్రీనింగ్
చైనా నుంచి ఆగ్రా చేరుకున్న ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆయనకు సోకింది ఎలాంటి వేరియంట్ అన్న విషయాన్ని తెలుసుకునేందుకు నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. ఈ మేరకు ఆగ్రా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏకే శ్రీవాస్తవ తెలిపారు. చైనాలో పని చేస్తూ ఆగ్రాకు వచ్చిన ఆ వ్యక్తిలో లక్షణాలైతే కనిపించలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం అతడిని షాగంజ్‌లోని ఆయన ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంచినట్టు తెలిపారు. నవంబరు 25 తర్వాత ఇక్కడ వెలుగు చూసిన కేసు ఇదొక్కటేనని, యాక్టివ్ కేసు కూడా ఇదొకటేనని పేర్కొన్నారు. 

చైనా నుంచి వచ్చిన ఆ వ్యక్తిని కలిసినవారు వెంటనే కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ ఏకే శ్రీవాస్తవ కోరారు. రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసిన తర్వాత ఆగ్రా రైల్వే స్టేషన్, బస్ స్టాపులు, విమానాశ్రయంలో టెస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరోవైపు, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఆగ్రాలోని చాలా వరకు హోటళ్లు పూర్తిగా నిండిపోయాయి.  

తాజ్‌మహల్ సందర్శనకు వచ్చే పర్యాటకులకు అధికారులు టెస్టులు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా విదేశీ పర్యాటకులపై అధికారులు దృష్టిసారించారు. యూఎస్, చైనా, జపాన్, బ్రెజిల్, యూరోపియన్ దేశాల నుంచి తాజ్‌మహల్, ఆగ్రా ఫోర్ట్, అక్బర్ టోంబ్ సందర్శనకు వచ్చే పర్యాటకులకు అక్కడే కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు.
China
COVID19
Agra
Taj Mahal

More Telugu News