KL Rahul: శ్రీలంకతో టీ20లకు రాహుల్ కు చాన్స్ కష్టమే..! కోలుకోని రోహిత్ శర్మ

  • రాహుల్ కు విశ్రాంతినిస్తే శుభమన్ గిల్ కు అవకాశం
  • గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని రోహిత్ శర్మ
  • సారథ్య బాధ్యతలను హార్ధిక్ పాండ్యా నిర్వహించే అవకాశం
KL Rahul set to be dropped from Indias T20I team for Sri Lanka series injured Rohit Sharma likely to miss out Report

శ్రీలంకతో స్వదేశంలో తలపడే జట్టు ఎంపిక బాధ్యత చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ముందు ఇప్పుడు ఉంది. ఈ సెలక్షన్ కమిటీకి ఇదే చివరి ఎంపిక కానుంది. పనితీరు ఆశించిన విధంగా లేకపోవడం, జట్టు ఎంపికపై తీవ్ర విమర్శలు వస్తున్న క్రమంలో కొత్త సెలక్షన్ కమిటీని బీసీసీఐ నియమించే పనిలో ఉండడం తెలిసిందే. ఈ లోపే జనవరి 3 నుంచి స్వదేశంలో శ్రీలంకతో భారత్ తలపడనుంది. 


శ్రీలంకతో సిరీస్ కు టీ20, వన్డేలకు విడిగా జట్లను ఎంపిక చేయాల్సిన బాధ్యత సెలక్షన్ కమిటీపై ఉంది. ఇప్పటి వరకు వెల్లడైన సమాచారం ఆధారంగా కేఎల్ రాహుల్ కు టీ20 సిరీస్ లో అవకాశం ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. పైగా ఆసియా కప్ తర్వాత టీ20ల్లో రాహుల్ పనితీరు ఆశించిన విధంగా లేదు. 16 ఇన్నింగ్స్ లకు గాను అతడు కేవలం ఆరు అర్ధ సెంచరీలు చేశాడు. మిగిలిన 10 ఇన్నింగ్స్ లలో అతడు ఒక అంకె స్కోరుకే వెనుదిరిగాడు. మరోవైపు వేలి గాయం నుంచి కోలుకుంటున్న రోహిత్ శర్మ సైతం అందుబాటులో ఉండడని బీసీసీఐ వర్గాల ఆధారంగా తెలుస్తోంది. దీంతో హార్ధిక్ పాండ్యా మరోసారి సారథ్య బాధ్యతలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఒకవేళ కేఎల్ రాహుల్ కు విరామం ఇస్తే, సెలక్టర్లు శుభమన్ గిల్ కు అవకాశం ఇవ్వొచ్చని భావిస్తున్నారు. విరాట్ కోహ్లీకి సైతం శ్రీలంకతో సిరీస్ కు అవకాశం లభించకపోవచ్చని తెలుస్తోంది. జనవరి 3 నుంచి మూడు టీ20లు, జనవరి 10నుంచి మూడు వన్డే మ్యాచ్ లలో శ్రీలంక-భారత్ పోటీ పడనున్నాయి.

More Telugu News