oscar: 'ఆర్ఆర్ఆర్'తో పాటు.. ఆస్కార్ బరిలో మరో తెలుగు వ్యక్తి చిత్రం

  • ఆస్కార్ షార్ట్ లిస్ట్ జాబితాలో పాకిస్థానీ చిత్రం జాయ్ లాండ్
  • దీనికి నిర్మాతగా వ్యవహరించిన అపూర్వ గురు చరణ్
  • హైదరాబాద్ లో పుట్టి అమెరికాలో స్థిరపడిన అపూర్వ
Another Telugu person film in the Oscar race

ఆర్ఆర్ఆర్ చిత్రంతో సగటు తెలుగువాడు మాత్రమే కాకుండా భారత దేశం మొత్తం గర్వపడేలా చేశారు దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి. ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడంతో పాటు భారీ వసూళ్లు, మరెన్నో రికార్డులు సొంతం చేసుకుంది ఈ చిత్రం. కొంతకాలం నుంచి ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల వర్షం కురుస్తోంది. చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డుల రేసులోనూ నిలిచింది. ఈ చిత్రంలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డులకు షార్ట్ లిస్ట్ అయింది. 

ఇదిలా ఉండగా, పాకిస్థానీ సినిమా 'జాయ్ ల్యాండ్' ఆస్కార్ బరిలో నిలిచింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో షార్ట్ లిస్ట్ అయింది. ఈ సినిమాకు తెలుగమ్మాయి అపూర్వ గురు చరణ్ నిర్మాతగా వ్యహరించడం విశేషం. అపూర్వ హైదరాబాద్‌లోనే పుట్టారు. అనంతరం ఆమె కుటుంబం అమెరికాకు వెళ్లిపోవడంతో అక్కడే పెరిగారు. 

ఇప్పటికే ఆమె 20కిపైగా షార్ట్ ఫిలిమ్స్ నిర్మించారు. స్నేహితులు ద్వారా తెలిసిన కథతో జాయ్ ల్యాండ్ ను నిర్మించారు. పెళ్లయిన హీరో.. ట్రాన్స్ జెండర్ (ట్రాన్స్ ఉమెన్)తో ప్రేమలో పడితే ఏం జరిగిందనేది సినిమాలో చూపించారు. తొలుత ఈ చిత్రంపై పాకిస్థాన్ లో అనేక విమర్శలు రావడంతో ప్రభుత్వం నిషేధం విధించింది. కానీ, ఈ చిత్రాన్ని కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించగా అద్భుత స్పందన వచ్చింది. ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ స్త్రీ వాద చిత్రంగా నిలిచింది. అనేక అంతర్జాతీయ అవార్డులు కూడా లభించాయి. 

దాంతో, పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా ఈ చిత్రాన్ని ఆస్కార్స్‌కు పంపించగా ఇప్పుడు షార్ట్‌లిస్ట్ అయ్యింది.  ఎల్‌జీబీటీక్యూ నేపథ్యంలో తెరకెక్కింది. మొత్తంగా అటు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్.. ఇటు అపూర్వ నిర్మించిన జాయ్ ల్యాండ్ చిత్రాలతో ఇద్దరు తెలుగు వ్యక్తులు అస్కార్ బరిలో నిలిచినట్టు అయింది.

More Telugu News