Tollywood: రాజకీయాల్లో ఎక్కువ కాలం ఇమడలేకపోయిన కైకాల

  • ఎన్టీఆర్ తో సాన్నిహిత్యంతో రాజకీయ రంగప్రవేశం
  • 1996లో మచిలీపట్నం నుంచి ఎంపీగా ఎన్నిక
  • రెండేళ్లకే రాజకీయాలకు దూరం
Satyanarayana had a brief stint in politics

తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించే నటుల్లో ఒకరైన కైకాల సత్యనారాయణ మరణంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కైకాల భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. సత్యనారాయణ కృష్ణాజిల్లా కౌతవరం గ్రామంలో 1935న జన్మించారు. నటనపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆయన 750కిపైగా చిత్రాల్లో నటించారు. పౌరాణికం, జానపదంతో పాటు కమర్షియల్ చిత్రాల్లోనూ మెప్పించారు. మూడు తరాల నటీనటులతో తెర పంచుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ తో పాటు మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ హీరోలతో కలిసి పని చేశారు. 

యమధర్మరాజు, దుర్యోధనుడు, ఘటోత్కచుడు వంటి పౌరాణిక పాత్రల్లో ఒదిగిపోయారు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ కైకాల అడుగు పెట్టారు. దివంగత ఎన్టీఆర్ తో సన్నిహితంగా ఉన్న ఆయన తెలుగు దేశం పార్టీలో చేరి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించారు. 1996లో ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. 81 వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ కు చెందిన కొలుసు పెద రెడ్డయ్య యాదవ్ పై ఘన విజయం సాధించారు. రెండేళ్ల తర్వాత లోక్ సభకు మళ్లీ ఎన్నికలు జరగ్గా మరో పర్యాయం పోటీ చేశారు. కానీ, 1998లో కావూరి సాంబశివరావు చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే, చిత్ర పరిశ్రమతో పాటు ఇటు రాజకీయాల్లోనూ సత్యనారాయణ ఎలాంటి వివాదాల్లో తలదూర్చలేదు.

More Telugu News