Chandrababu: నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ మరణం విచారకరం: చంద్రబాబు, నారా లోకేశ్

Chandrababu and Nara Lokesh pays condolences to Kaikala Satyanarayana
  • ఈ తెల్లవారుజామున కన్నుమూసిన కైకాల సత్యనారాయణ
  • మేటి నటులు అని కొనియాడిన చంద్రబాబు
  • ఎన్టీఆర్ గారితో ఆయనకున్న అనుబంధం అన్నదమ్ముల కన్నా ఎక్కువని వ్యాఖ్య
తెలుగు సినీ పరిశ్రమలో మరో లెజెండ్ కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ఇటీవలి కాలంలో కృష్ణంరాజు, కృష్ణలను కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోయిన టాలీవుడ్ సత్యనారాయణ మరణవార్తతో షాక్ కు గురైంది. ఆయన మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని తెలుపుతున్నారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు సత్యనారాయణ మృతి పట్ల తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ... విభిన్న పాత్రల్లో నటించి, తన విలక్షణ నటన ద్వారా అభిమానుల చేత నవరస నటనా సార్వభౌమ అనిపించుకున్న మేటీ నటులు, టీడీపీ మాజీ పార్లమెంటు సభ్యులు కైకాల సత్యనారాయణ గారి మరణం విచారకరం. సత్యనారాయణగారి ఆరు దశాబ్దాల సినీ జీవితంలో ఎన్టీఆర్ గారితో ఆయనకున్న అనుబంధం సొంత అన్నదమ్ముల కన్నా ఎక్కువ అని చెప్పారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందిస్తూ.. 'సీనియర్ నటులు, మాజీ ఎంపీ, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారి మృతి విచారకరం. విలక్షణ నటనతో విభిన్న పాత్రలకు జీవం పోసిన ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అని ట్వీట్ చేశారు.
Chandrababu
Nara Lokesh
Telugudesam
Kaikala Satyanarayana
Tollywood

More Telugu News