టీడీపీ చంద్రబాబుది కాదు.. ఏపీలో ఎన్టీఆర్‌ను సీఎం చేయాలి: ఎర్రబెల్లి

  • హన్మకొండలో విలేకరుల సమావేశంలో ఎర్రబెల్లి వ్యాఖ్యలు
  • టీడీపీ చంద్రబాబుది కాదని వ్యాఖ్య
  • చంద్రబాబు సీఎంగా దిగిపోయే నాటికి హైటెక్ సిటీ వద్ద మంచినీళ్లకు కూడా దిక్కులేదన్న మంత్రి సబిత
Chandrababu should Make Jr NTR as AP CM

చంద్రబాబునాయుడికి నిజంగానే టీడీపీపై ప్రేమే ఉంటే సినీ నటుడు ఎన్టీఆర్‌ను ఏపీకి ముఖ్యమంత్రిని చేయాలని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. హన్మకొండలో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మొన్నటి ఖమ్మం సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. వివిధ పార్టీల్లో చేరిన తెలుగు తమ్ముళ్లు వెనక్కి రావాలని పిలుపునిచ్చారు. 

ఇదే విషయాన్ని ఎర్రబెల్లి వద్ద ప్రస్తావించినప్పుడు ఆయన పై వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబుది కాదని, ఎన్టీఆర్‌దని అన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు ఏపీకి సీఎం కావాలని అనుకుంటున్నారని అన్నారు. ప్రజలు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబుకు నిజంగానే ఎన్టీఆర్‌పై అంత ప్రేమే ఉంటే ఏపీలో ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు.

మరోవైపు, హైదరాబాద్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎంగా దిగిపోయే నాటికి హైటెక్ సిటీ వద్ద మంచినీళ్లకు కూడా దిక్కులేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా రాష్ట్రం గొప్పగా అభివృద్ధి సాధిస్తోందన్నారు. బీజేపీకి దగ్గర కావాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు మళ్లీ తెలంగాణ పాటపాడుతున్నారని విమర్శించారు. కరోనా సమయంలో తెలంగాణలోనే ఉన్న చంద్రబాబునాయుడు ప్రజలను కలిసే ప్రయత్నం ఒక్కసారైనా చేయలేదని మంత్రి సబిత విమర్శించారు.

More Telugu News