BF-7: బీఎఫ్-7 వేరియంట్ లక్షణాలు ఇవే!

  • తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఒమిక్రాన్ బీఎఫ్-7
  • చైనాలో హడలెత్తిస్తున్న కొత్త వేరియంట్
  • భారత్ లోనూ నాలుగు కేసులు
  • పాత వేరియంట్ల తరహాలోనే బీఎఫ్-7 లక్షణాలు
  • దీనికంటూ ప్రత్యేక లక్షణం లేదంటున్న నిపుణులు
Symptoms of Omicron BF7 variant

బీఎఫ్-7... ప్రపంచదేశాలు ఇప్పుడీ కరోనా వేరియంట్ నామస్మరణ చేస్తున్నాయి. మూడేళ్ల పాటు యావత్ మానవాళిని వణికించిన కరోనా మహమ్మారి సద్దుమణిగిందని అనుకునే లోపే... ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ రంగప్రవేశం చేసింది. చైనాలో ఇప్పుడు నెలకొన్న భయానక పరిస్థితులకు ఈ కొత్త వేరియంటే కారణం. బీఎఫ్-7 రకాన్ని భారత్ లోనూ గుర్తించడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ నేపథ్యంలో, బీఎఫ్-7 కరోనా వేరియంట్ సోకితే మానవుల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయన్న దానిపై నిపుణులు వివరణ ఇచ్చారు. గతంలో వ్యాపించిన కరోనా వైరస్ రకాలు ఎలాంటి లక్షణాలు కలిగించిందో, బీఎఫ్-7 కూడా దాదాపు అలాంటి లక్షణాలే కలిగిస్తుందని అహ్మదాబాద్ అపోలో ఆసుపత్రి సీనియర్ క్రిటికల్ కేర్ స్పెషలిస్టు డాక్టర్ మహర్షి దేశాయ్ తెలిపారు. దీనికంటూ ప్రత్యేక లక్షణమేమీ లేదన్నారు. 

సాధారణంగా జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ముక్కు కారడం, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయని, కొందరిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తీవ్రమైన దగ్గు, అలసట, ఆక్సిజన్ స్థాయులు పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వివరించారు. 

అయితే, కరోనా వేరియంట్లకు సంబంధించి భారతీయులు ఇప్పటికే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకున్నారని డాక్టర్ దేశాయ్ వెల్లడించారు. కానీ, ఈ వైరస్ జన్యువులు తరచుగా రూపాంతరం చెందుతుంటాయని, అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఒక్కోసారి కరోనా వైరస్ ప్రమాదకర రీతిలో జన్యుమార్పులకు గురవుతుందని, మానవులు అప్పటివరకు పొందిన వ్యాధినిరోధక శక్తి కూడా దానిముందు పనిచేయదని వివరించారు.

More Telugu News