hardik panya: రోహిత్ పై వేటు.. హార్దిక్ పాండ్యాకు టీమిండియా పగ్గాలు!

 Hardik Pandya set to replace Rohit Sharma as ODI and T20 captain of India  says report
  • శ్రీలంకతో టీ20 సిరీస్ లో కెప్టెన్సీ వహించనున్న పాండ్యా 
  • టీ20, వన్డే ఫార్మాట్ పూర్తి స్థాయి నాయకత్వాన్ని అతనికి
     అప్పగించే యోచనలో బోర్డు
  • ఆసియా కప్, టీ20 ప్రపంచ కప్ లో పేలవ ప్రదర్శన నేపథ్యంలో ఈ నిర్ణయం!
ఆసియా కప్ టీ20 టోర్నమెంట్, టీ20 ప్రపంచ కప్ తో పాటు బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో భారత జట్టు పేలవ ప్రదర్శన చేసిన నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మపై చర్యలకు బీసీసీఐ ఉపక్రమించినట్టు తెలుస్తోంది. రోహిత్ శర్మను టీ20, వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించాలని బోర్డు పెద్దలు నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అతని స్థానంలో హార్దిక్ పాండ్యాకు పొట్టి ఫార్మాట్ పగ్గాలు అప్పగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 

ఈ క్రమంలో జనవరి 3 నుంచి ముంబైలో ప్రారంభం కానున్న శ్రీలంకతో రాబోయే టీ 20 సిరీస్‌లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా భారత్‌కు నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో రెండు, మూడు మ్యాచ్‌లు పూణె (జనవరి 5), రాజ్‌కోట్‌ (జనవరి 7)లలో జరగనున్నాయి. ప్రస్తుతం రోహిత్ శర్మ బొటన వేలి గాయం తగ్గక పోవడంతో బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కు దూరంగా ఉన్నాడు. 

అతని గాయం నయం కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అతను శ్రీలంకతో టీ20 సిరీస్ కు కూడా దూరంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ లో భారత జట్టును హార్దిక్ నడిపించడం లాంఛనమే కానుంది. అయితే, రోహిత్ స్థానంలో హార్దిక్ ను పూర్తి స్థాయి టీ20 కెప్టెన్ చేసే విషయంలో ఇంకా చర్చలు నడుస్తున్నాయి. కొత్త సెలక్షన్ కమిటీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ మార్పు ఉంటుందని తెలుస్తోంది. బుధవారం జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయంపై చర్చించలేదని బోర్డు సభ్యులు తెలిపారు. కెప్టెన్సీ మార్పుపై సెలక్షన్ కమిటీ మాత్రమే నిర్ణయం తీసుకుంటుందని పేరు చెప్పడానికి ఇష్టపడని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు.
hardik panya
Team India
Rohit Sharma
odi
t20
captaincy

More Telugu News