Andhra Pradesh: ఏపీలో 50 రోజుల్లో 130 కరోనా కేసులు: ఏపీ ఆరోగ్యశాఖ

  • వారం రోజుల్లోనే బాధితులు కోలుకున్నారన్న ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్
  • అనుమానితులను పరీక్షించేందుకు కిట్లు సిద్ధంగా ఉన్నాయన్న అధికారి
  • కరోనా బారినపడిన వారిలో ఒమిక్రాన్-ఎక్స్ బీబీ వేరియంట్ ఉన్నట్టు గుర్తింపు
130 Corona Cases in last 50 days in Andhrapradesh

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. గత 50 రోజుల్లో 130 కేసులు బయటపడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్ నిన్న తెలిపారు. ఉప ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకు అనుమానిత లక్షణాలు కలిగిన వారిని పరీక్షించేందుకు అవసరమైన ర్యాపిడ్ టెస్ట్ కిట్‌లు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. గత 50 రోజుల్లో 30,440 నమూనాలను పరీక్షించామని, వారిలో 0.42 శాతం మందికి అంటే 130 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందన్నారు. 

అయితే, వారందరూ వారం రోజుల్లోనే కోలుకున్నారని, ఎవరూ ఆసుపత్రుల్లో చేరలేదని తెలిపారు. కరోనా పాజిటివ్‌గా తేలిన 130 మందిలో నిర్దేశిత ప్రమాణాల ప్రకారం 48 నమూనాలకు జినోమ్ సీక్వెన్సింగ్ చేయించామని, వారిలో ఒమిక్రాన్-ఎక్స్‌ బీబీ వేరియంట్ ఉన్నట్టు నిర్ధారణ అయిందన్నారు. బాధితుల్లో ఒమిక్రాన్ తరహా లక్షణాలే కనిపించినట్టు నివాస్ వివరించారు. విదేశాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి అప్రమత్తంగా ఉన్నట్టు తెలిపారు.

More Telugu News