Akkineni Nagarjuna: నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ సినీ నటుడు నాగార్జునకు గోవా అధికారుల నోటీసులు

Nagarjuna issued notice over alleged illegal construction work in Goa
  • నార్త్ గోవాలో పాప్యులర్ అయిన మాండ్రమ్ బీచ్ వద్ద నాగార్జున రెసిడెన్షియల్ ప్రాజెక్ట్
  • గోవా పంచాయతీరాజ్ చట్టం కింద నోటీసుల జారీ
  • పనులు నిలిపివేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక
టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగార్జునకు గోవా ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అశ్వెవాడ గ్రామ పరిధిలో నాగార్జున అక్రమ నిర్మాణాలు చేపట్టారని, వెంటనే ఆ పనులు నిలిపివేయాలని మండ్రెమ్ పంచాయతీ నిన్న జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. గోవా పంచాయతీరాజ్ చట్టం 1994 కింద సర్పంచ్ అమిత్ సావంత్ ఈ నోటీసులు జారీ చేశారు. వెంటనే పనులు నిలిపివేయాలని, లేదంటే చర్యలు తప్పవని అందులో హెచ్చరించారు.

నార్త్ గోవాలోని పాప్యులర్ విలేజ్ అయిన మాండ్రమ్‌లో నాగార్జున ఓ రెసిడెన్షియల్ కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్టు చేపట్టారు. అయితే, ఈ నిర్మాణానికి ఆయన ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని సర్పంచ్ అమిత్ సావంత్ పేర్కొన్నారు. వారి వద్ద అనుమతి ఉంటే కనుక దానిని చూపించాలన్నారు. వెంటనే పనులను నిలిపివేయాలని నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఆయన నటుడా? ఇంకెవరా? అన్న సంగతి తమకు తెలియదని, అయితే తాము చట్టబద్ధంగా కట్టే నిర్మాణాలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. మాండ్రమ్ అనేది నార్త్ గోవాలో ప్రముఖమైన బీచ్. ఇక్కడికి పర్యాటకులు పోటెత్తుతుంటారు. ముఖ్యంగా రష్యా పర్యాటకులకు ఇది హబ్ లాంటిది.
Akkineni Nagarjuna
Goa
Tollywood
Mandrem village

More Telugu News