Bharat Jodo Yatra: కొవిడ్ నిబంధనలు పాటించాలి.. లేదంటే యాత్ర వాయిదా వేసుకోవాలి: రాహుల్ కు కేంద్రం సూచన

  • రాహుల్ గాంధీకి లేఖ రాసిన కేంద్ర మంత్రి మాండవీయ
  • భారత్ జోడో యాత్రలో మాస్క్ లు, శానిటైజర్లు వినియోగించాలని సూచన
  • కుదరకపోతే జాతి ప్రయోజనాల రీత్యా యాత్ర వాయిదా వేసుకోవాలన్న మంత్రి  
Postpone Bharat Jodo Yatra if Covid norms cant be followed Health minister writes to Rahul Gandhi

భారత్ జోడో యాత్రలో కరోనా మార్గదర్శకాలను విధిగా పాటించాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీని కేంద్ర ప్రభుత్వం కోరింది. లేదంటే యాత్రను వాయిదా వేసుకోవాలని సూచిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు సైతం కరోనా మార్గదర్శకాల అమలుకు సంబంధించి మాండవీయ లేఖ రాశారు.

చైనా, జపాన్ తదితర దేశాల్లో కరోనా కేసులు పెద్ద ఎత్తున పెరుగుతున్న తరుణంలో.. భారత్ జోడో యాత్రలో భాగంగా మాస్క్ లు విధిగా ధరించాలని, శానిటైజర్లు వినియోగించాలని కోరారు. ‘‘టీకాలు తీసుకున్న వారే భారత్ జోడో యాత్రలో పాల్గొనాలి. కరోనా నిబంధనలు పాటించాలి. అది వీలు కాకపోతే ప్రజారోగ్యం అత్యవసర పరిస్థితులు, జాతి ప్రయోజనాల దృష్ట్యా యాత్రను వాయిదా వేసుకోవాలి’’ అని లేఖలో పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రలో వేలాది మంది పాల్గొంటూ ఉండడం, అందరూ గుంపులుగా, మధ్య ఎడం లేకుండా నడుస్తున్న క్రమంలో కేంద్రం ఈ సూచన చేయడం గమనార్హం. దీనిపై రాహుల్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరోవైపు రాహుల్ భారత్ జోడో యాత్ర బుధవారం హర్యానా రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి రాహుల్ భారత్ జోడో యాత్రను ప్రారంభించడం తెలిసిందే. ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ లోని పలు ప్రాంతాలను చుట్టేసి, హర్యానాలోకి అడుగు పెట్టింది.

More Telugu News