tdp palnadu: షేక్ ఇబ్రహీం హత్య అత్యంత కిరాతకం: చంద్రబాబు

  • టీడీపీ ముస్లిం నేత హత్యపై చంద్రబాబు ట్వీట్
  • జగన్ రెడ్డీ.. మీ ధనదాహం తీరదా? అన్న లోకేశ్ 
  • వైసీపీ మూకల దాడిలో గాయపడ్డ అలీ కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడి
  • అధికార పార్టీ ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేదాకా పోరాడతామని స్పష్టం చేసిన లోకేశ్ 
chandrababu responce on tdp palnadu leader murder

ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడులో జరిగిన టీడీపీ నేత షేక్ ఇబ్రహీం హత్యపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఇబ్రహీం హత్య అత్యంత కిరాతకమని చంద్రబాబు ట్వీట్ చేశారు. పల్నాడులో శాంతి భద్రతల దుస్థితికి ఈ హత్య నిదర్శనమని మండిపడ్డారు. ఈ ముఖ్యమంత్రి పల్నాడును ఏంచేయాలనుకుంటున్నారోనని అన్నారు. ఇబ్రహీం హత్యపై జవాబు చెప్పాలని సీఎం జగన్ ను నిలదీశారు. పల్నాడు జిల్లా ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం చంద్రబాబు ట్వీట్ చేశారు.

ముస్లిం మైనారిటీలను అంతమొందించేందుకే జగన్ ముఖ్యమంత్రి అయినట్టుందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. మసీదు ఆస్తుల సంరక్షణ కోసం పోరాడుతున్న షేక్ ఇబ్రహీంను పట్టపగలు, అందరూ చూస్తుండగానే హత్య చేయడం జగన్ సైతాన్ పాలనకు పరాకాష్ఠ అని మండిపడ్డారు. వైసీపీ మూకల దాడిలో గాయపడిన మరో కార్యకర్త అలీ ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగానే ఉందని లోకేశ్ చెప్పారు. అలీ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

షేక్ ఇబ్రహీం హత్య ముమ్మాటికీ వైసీపీ ప్రభుత్వ స్పాన్సర్డ్ మర్డర్లేనని లోకేశ్ ఆరోపించారు. ఈ హత్య చేసిన వాళ్లను, హత్యకు సూత్రధారులైన వైసీపీ నేతలనూ తక్షణమే అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఉసురు తీశారు. ఇప్పుడు ఇబ్రహీంను చంపేశారు. జగన్ రెడ్డి గారు.. మీ ధనదాహం, రక్తదాహం తీరదా?’ అంటూ ముఖ్యమంత్రిని ట్విట్టర్ లో లోకేశ్ నిలదీశారు. వైసీపీ ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు టీడీపీ తరఫున చేస్తున్న పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని లోకేశ్ వివరించారు.

More Telugu News