immunity: చైనాలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో.. మన పరిస్థితిపై ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ గులేరియా అభిప్రాయాలు

Our immunity robust but be vigilant Ex AIIMS director to HT amid China Covid surge
  • కరోనా వచ్చి మూడేళ్లవుతోందన్న గులేరియా
  • ఈ కాలంలో ఎన్నో పర్యాయాలు ఇన్ఫెక్షన్ల బారిన పడినట్టు వెల్లడి
  • కరోనాకు వ్యతిరేకంగా రోగనిరోధకత బలంగా ఉందన్న విశ్లేషణ
చైనాలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండడంపై కేంద్ర సర్కారు అప్రమత్తమై, నేడు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తోంది. మరో విడత కరోనా వైరస్ ముప్పు ఎదురవుతుందా? అన్న ఆందోళన నెలకొంది. ఈ తరుణంలో ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా తన విశ్లేషణ, అభిప్రాయాలను హిందుస్థాన్ టైమ్స్ మీడియాతో పంచుకున్నారు.

ప్రస్తుతం చైనా ఎదుర్కొంటున్న తరహా పరిస్థితి భారత్ లో ఉండబోదని గులేరియా చెప్పారు. మన దగ్గర దాదాపు అందరికీ టీకాలు ఇవ్వడంతోపాటు, అధిక శాతం కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడిన విషయాలను ప్రస్తావించారు. చైనా, ఇటలీ పరిస్థితుల నేపథ్యంలో మెరుగైన సన్నద్ధతతో ఉండడం మంచిదేనన్నారు. 

''మొదట కరోనా మహమ్మారి ప్రవేశించినప్పుడు దానికి వ్యతిరేకంగా మనలో రోగ నిరోధక శక్తి లేదు. ఇది కొందరిలో తీవ్ర ఇన్ఫెక్షన్ కు దారితీసింది. కానీ కరోనా వచ్చి సుమారు మూడేళ్లు అవుతోంది. ఈ కాలంలో సహజంగా ఇన్ఫెక్షన్ల బారిన ఎన్నోసార్లు పడ్డాం. చాలా మంది ఎక్కువ సార్లు ఇన్ఫెక్షన్ కు గురయ్యారు. టీకాల కవరేజీ కూడా ఎక్కువగా ఉంది. ఈ వైరస్ ను కట్టడి చేయడానికి మనలో బలమైన రోగనిరోధకత ఏర్పడింది. కనుక ఇన్ఫెక్షన్ మనపై తీవ్రంగా దాడి చేయలేదు. 

గతంలో ఆల్ఫా, బీటా, డెల్టా వేరియంట్లను చూశాం. ఇవన్నీ భిన్నమైనవి. కానీ గత ఏడాది కాలంలో కనిపిస్తున్నవన్నీ ఒమిక్రాన్ వేరియంట్ ఉప రకాలే. భిన్నమైన మరో కొత్త వేరియంట్ రాలేదు. కాకపోతే అప్రమత్తంగా ఉండాలి. వైరస్ ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు కనుక కన్నేసి ఉంచాలి’’ అని గులేరియా వివరించారు. కరోనా తొలి నాళ్లలో మన దేశం అనుసరించిన వ్యూహాలను గులేరియా సమర్థించారు.

‘‘మనం ముందుగానే లాక్ డౌన్ పెట్టేశాం. చాలా మంది దీన్ని తొందరపాటు అన్నారు. కానీ, ఈ చర్య వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన పెరిగేలా చేసింది. సన్నద్దం కావడానికి అవకాశం ఇచ్చింది. ఈ కాలంలో కరోనా వ్యాధి బాధితులకు చికిత్స అందించే సదుపాయాలను పెంచుకోవడంపై దృష్టి పెట్టే సమయం చిక్కింది. అదంతా రోలర్ కోస్టర్ రైడ్. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మనం మెరుగ్గా పనిచేశాం’’ అని వివరించారు.
immunity
covid
corona
china
India
aiims
ex director
ranadip guleria

More Telugu News