Taliban: తాలిబన్ల మరో కీలక నిర్ణయం.. యూనివర్సిటీ విద్యకు మహిళలను దూరం చేస్తూ ఆదేశాలు!

  • తక్షణం అమలు చేయాలని ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలకు ఆదేశం
  • ఇప్పటికే మాధ్యమిక, హైస్కూలు విద్యకు బాలికలను దూరం చేసిన తాలిబన్లు
  • తాజా నిర్ణయంపై ప్రపంచ దేశాల ఖండన
Taliban bar women from university education in Afghanistan

తాలిబన్ల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌లో అధికారం చేపట్టినప్పటి నుంచి పేట్రేగిపోతున్న తాలిబన్లు మహిళల విషయంలో గతంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా కాలరాస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు మహిళలపై పలు ఆంక్షలను విధించి, వారి హక్కులను కాలరాస్తున్న తాలిబన్ నాయకత్వం తాజాగా వారిని యూనివర్సిటీ విద్యకు నిరవధికంగా దూరం చేసింది. ఈ మేరకు ఆ దేశ విద్యా మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. తాలిబన్ల తాజా ఆదేశాలను ప్రపంచ దేశాలు ఖండించాయి.
 
తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత తమ పాలన గతంలోలా ఉండదని, ఈసారి ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, మైనారిటీలకు మరిన్ని హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ మహిళలపై ఉక్కుపాదం మోపుతున్నారు. మాధ్యమిక, హైస్కూల్ విద్యకు బాలికలను దూరం చేశారు. చాలా వరకు ఉద్యోగాల్లో మహిళలపై ఆంక్షలు విధించారు. మహిళలు బయటకు వచ్చేటప్పుడు కాలి బొటన వేలి నుంచి తల వరకు మొత్తం కప్పుకోవాలని ఆదేశించి అమలు చేస్తున్నారు. ఉల్లంఘించేవారికి కఠిన శిక్షలు విధిస్తున్నారు.

పార్కులు, జిమ్‌లకు వెళ్లకుండా మహిళలపై నిషేధం ఉంది. ప్రయాణాల సమయంలోనూ మహిళల వెంట పురుష బంధువు ఉండాల్సిందే. తాజాగా, యూనివర్సిటీ విద్య నుంచి కూడా మహిళలను దూరం చేసింది. ఇది కేబినెట్ నిర్ణయమని, ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలు మహిళల ప్రవేశాన్ని తక్షణం నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

More Telugu News