Shahrukh Khan: ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతమైన నటుల జాబితా.. ఇండియా నుంచి షారుఖ్ ఒక్కడికే చోటు!

Shah Rukh Khan only Indian in Empire magazines 50 Greatest Actors of All Time
  • 50 మంది నటుల జాబితా విడుదల చేసిన ‘ఎంపైర్’
  • డెంజల్ వాషింగ్టన్, టామ్ హాంక్స్, మార్లన్ బ్రాండో సరసన షారుఖ్
  • షారుఖ్ ‌ను ఆకాశానికెత్తేసిన ‘ఎంపైర్’
ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులైన 50 మంది నటుల జాబితాలో ఇండియా నుంచి ఒకే ఒక్క నటుడు, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు చోటు లభించింది. బ్రిటన్‌కు చెందిన ‘ఎంపైర్’ మ్యాగజైన్ ఈ జాబితాను వెల్లడించింది. ‘50 గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆల్‌టైమ్’ పేరుతో విడుదల చేసిన ఈ జాబితాలో హాలీవుడ్ ప్రముఖ నటులు డెంజల్ వాషింగ్టన్, టామ్ హాంక్స్, ఆంథోనీ మార్లన్ బ్రాండో వంటి దిగ్గజాలతోపాటు షారుఖ్ ఖాన్‌కు కూడా ఇందులో చోటు దక్కింది. 

నాలుగు దశాబ్దాలుగా బాలీవుడ్‌ను ఏలుతున్న షారుఖ్ సాధించిన విజయాలను, అతడికున్న అభిమానుల గురించి ‘ఎంపైర్’ ప్రత్యేకంగా ప్రస్తావించింది. అంతేకాదు, ఓ సినిమాలో అతడు చెప్పే ‘జీవితం రోజూ మన ఊపిరిని కొద్దికొద్దిగా హరిస్తుంది.. అదే బాంబు అయితే ఒకేసారి ప్రాణం తీస్తుంది’ అన్న డైలాగ్ గురించి చెబుతూ.. అతడి కెరియర్‌లోనే ఈ డైలాగ్ ఉత్తమమైనదని కొనియాడింది. దేవ్‌దాస్, మై నేమ్ ఈజ్ ఖాన్, కుఛ్ కుఛ్ హోతా హై వంటి సినిమాల్లో అద్భుతంగా నటించాడంటూ ఆకాశానికెత్తేసింది. ‘ఎంపైర్’ మ్యాగజైన్ కథనాన్ని షారుఖ్ మేనేజర్ పూజా దద్లానీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

ఇదిలావుంచితే, షారుఖ్ నటించిన తాజా చిత్రం ‘పఠాన్’ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అందులోని ‘బేషరమ్ రంగ్’ పాటపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. సినిమాను నిషేధించాలంటూ నిరసన ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. ‘బాయ్‌కాట్ పఠాన్’ హ్యాష్‌టాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. పలువురు రాజకీయ నాయకులు కూడా సినిమాను తమ రాష్ట్రంలో విడుదల కానివ్వబోమని హెచ్చరించారు.
Shahrukh Khan
Bollywood
Empire magazine
50 Greatest Actors of All Time
Tom Hanks

More Telugu News