girl kidnap: తండ్రిని తోసేసి కూతురు కిడ్నాప్.. సిరిసిల్ల జిల్లాలో దారుణం.. వీడియో ఇదిగో

Minor Girl Kidnapped by Unknown Persons in Rajanna Siricilla
  • రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో కలకలం
  • గ్రామానికి చెందిన యువకుడిపై యువతి తండ్రి ఫిర్యాదు
  • గతంలో వాళ్లిద్దరూ ఇంట్లోంచి పారిపోయారంటున్న గ్రామస్థులు
  • కారు నెంబర్ ఆధారంగా దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు
తెల్లవారుజామున తండ్రితో కలిసి గుడికి వెళ్లి వస్తున్న యువతిని కారులో వచ్చిన దుండగులు బలవంతంగా ఎత్తుకెళ్లారు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

జిల్లాలోని చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన గోలి శాలినిని కొంతమంది యువకులు కిడ్నాప్ చేశారు. మంగళవారం తెల్లవారుజామున హనుమాన్ ఆలయంలో పూజ చేయడానికి శాలిని వెళ్లింది. తోడుగా ఆమె తండ్రి కూడా వెళ్లారు. అప్పటికే అక్కడికి కారులో వచ్చిన కొంతమంది యువకులు శాలిని బయటకు వచ్చేదాకా ఎదురుచూశారు.

పూజల తర్వాత గుడిలో నుంచి బయటకొచ్చిన శాలిని తన తండ్రితో కలిసి ఇంటికి బయలుదేరింది. ఇది గమనించిన యువకులు కారులో వాళ్ల దగ్గరికి వేగంగా దూసుకొచ్చారు. కార్లోంచి దిగి శాలిని తండ్రిని పక్కకు తోసేశారు. ఓ యువకుడు శాలిని తండ్రిని పట్టుకోగా మరో యువకుడు శాలినిని బలవంతంగా కార్లోకి ఎక్కించాడు. ఆపై శాలిని తండ్రిని తోసేసి ఆ యువకులు కారులో ఉడాయించారు. 

కారును ఆపేందుకు ప్రయత్నించినా ఉపయోగంలేకుండా పోయిందని శాలిని తండ్రి చెప్పాడు. వెంటనే తన బండితో కారును అనుసరించేందుకు ప్రయత్నించినా ఫలితంలేదని పోలీసులకు వివరించాడు. తమ కూతురు కిడ్నాప్ వెనక గ్రామానికే చెందిన కటుకూరి జాన్ ప్రమేయం ఉండొచ్చని శాలిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జాన్, శాలిని ఏడాది క్రితం ఇంట్లోంచి పారిపోయారని గ్రామస్థులు చెబుతున్నారు. శాలిని మైనర్ కావడం, ఆమె తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు వాళ్లిద్దరినీ తిరిగి తీసుకొచ్చారు. జాన్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇటీవల మైనార్టీ తీరడంతో శాలినికి తల్లిదండ్రులు వేరే యువకుడితో నిశ్చితార్థం చేశారు. ఈ నేపథ్యంలోనే శాలిని కిడ్నాప్ కు గురికావడంతో జాన్ పైనే గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సీసీటీవీ ఫుజేటీ, కారు నంబర్ ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
girl kidnap
Rajanna Sircilla District
CCTV vedio
Telangana

More Telugu News