Rahul Gandhi: ద్వేషపూరిత మార్కెట్‌లో ప్రేమను పంచే దుకాణాన్ని తెరిచా: రాహుల్ గాంధీ

Im opening mohabbat ki dukaan in a market of hate says Rahul Gandhi
  • బీజేపీ నాయకులు వారి పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో ఎందుకు చదివిస్తున్నారని ప్రశ్నించిన రాహుల్ 
  • ప్రపంచంలో అందరితో మాట్లాడడం హిందీతోనే సాధ్యం కాదన్న కాంగ్రెస్ అగ్రనేత
  • నెలకోసారి ప్రజల వద్దకు వెళ్లాలని రాజస్థాన్ మంత్రులకు సూచన
ఇంగ్లిష్‌ను తీవ్రంగా వ్యతిరేకించే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్రమంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు వారి పిల్లలను ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో ఎందుకు చదివిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ‘భారత్ జోడో’ యాత్రలో భాగంగా నిన్న రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరిగిన సభలో రాహల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘నువ్వు ఏం చేస్తున్నావ్? కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఎందుకు నడుస్తున్నావని’ బీజేపీ నేతలు తనను ప్రశ్నిస్తున్నారన్న రాహుల్ గాంధీ.. ద్వేషపూరితం చేసే ఓ మార్కెట్‌లో ప్రేమను పంచే దుకాణాన్ని తెరిచానని వారికి చెబుతున్నానని పేర్కొన్నారు. మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్, నెహ్రూ, ఆజాద్ వంటి నేతలందరూ ఇలాగే ప్రేమను పంచారని, ఇప్పుడు తాను వారి బాటలోనే నడుస్తున్నట్టు చెప్పారు. రాజస్థాన్ మంత్రులందరూ నెలకోసారి ప్రజల్లోకి వెళ్లాలని రాహుల్ సూచించారు.

బీజేపీ నేతల ‘హిందీ భాష’ ప్రచారంపై రాహుల్ మాట్లాడుతూ.. హిందీ, తమిళం, ఇతర భాషలు చదవొద్దని తాను చెప్పడం లేదన్నారు. అయితే, ప్రపంచంలో ఇతరులు ఎవరితోనైనా మాట్లాడాలంటే అది ఒక్క హిందీతోనే సాధ్యం కాదని, ఇంగ్లిష్‌తో మాత్రమే సాధ్యమన్న విషయాన్ని తాను చెబుతున్నట్టు స్పష్టం చేశారు. కాగా, ఢిల్లీ సిక్కు వ్యతిరేక అల్లర్లలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగదీశ్ టైట్లర్ భారత్ జోడో యాత్రలో పాల్గొనడంపై బీజేపీ దుమ్మెత్తి పోసింది. దానికి కౌంటర్‌ గానే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Rahul Gandhi
Congress
Bharat Jodo Yatra
Rajasthan

More Telugu News