China: అత్యాధునిక డ్రోన్లను భారత సరిహద్దులకు తరలిస్తున్న చైనా

  • భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు
  • 2017లో డోక్లాం ప్రతిష్టంభన 
  • సరిహద్దుల వద్ద పెరిగిన చైనా సైనిక కార్యకలాపాలు
  • భారీగా ఆయుధాల తరలింపు
  • వైమానిక స్థావరాల విస్తరణ
China increases drones and war planes at borders

గత కొన్నేళ్లుగా భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండడం తెలిసిందే. ఇరుదేశాల సైనికులు ఘర్షణలకు దిగడం, ప్రాణనష్టం జరగడం వంటివి కూడా చోటుచేసుకున్నాయి. భారత్ ఆత్మరక్షణకు ప్రాధాన్యత ఇస్తుండగా, చైనా మాత్రం సరిహద్దుల్లో మోహరింపులు పెంచుతూ యుద్ధ సన్నద్ధతను చాటుతోంది. 

తాజాగా భారత ఈశాన్య ప్రాంతంలో సరిహద్దుల వెంబడి చైనా అత్యాధునిక డ్రోన్లు, యుద్ధ విమానాల కదలికలు పెరిగాయి. అరుణాచల్ ప్రదేశ్ వద్ద సరిహద్దులకు 150 కిమీ దూరంలోని బంగ్డా వైమానిక స్థావరంలో చైనా డబ్ల్యూజెడ్-7 డ్రోన్లను మోహరించింది. 

సోరింగ్ డ్రాగన్ గా పిలిచే ఈ డ్రోన్లను చైనా గతేడాదే ఆవిష్కరించింది. ఈ డ్రోన్లు నిఘా వేయడంతో పాటు మిస్సైళ్లను కూడా ప్రయోగించగలవు. ఏకధాటిగా 10 గంటల సేపు గాల్లో ఎగిరే సామర్థ్యం వీటి సొంతం. ఈ తరహా డ్రోన్లు భారత్ వద్ద లేవు. ఇటీవల లభ్యమైన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో ఈ డ్రోన్లు స్పష్టంగా కనిపించాయి. 

అంతేకాదు, రెండు ఫ్లాంకర్ శ్రేణి యుద్ధ విమానాలను కూడా చైనా బంగ్డా వైమానిక స్థావరంలో సిద్ధంగా ఉంచింది. ఇవి భారత్ ఉపయోగిస్తున్న రష్యా తయారీ సుఖోయ్ యుద్ధ విమానాలకు నకళ్లుగా పేరుపడ్డాయి.

2017లో డోక్లాం వద్ద ప్రతిష్టంభన ఏర్పడినప్పటి నుంచి చైనా సరిహద్దుల సమీపంలో సైనిక కార్యకలాపాలు ముమ్మరం చేసింది. యుద్ధం వస్తే కొన్ని గంటల్లోనే సైన్యాన్ని సరిహద్దులకు తరలించేలా రోడ్డు, రైలు మార్గాలను అభివృద్ధి చేసింది.

More Telugu News