BJP: ప్రజలకే నేను జవాబుదారీగా ఉంటా: రఘునందన్ రావు

  • ఉద్యమంలో నుంచి ఎదిగానన్న బీజేపీ ఎమ్మెల్యే
  • ఆరోపణలను నిరూపించాలని రోహిత్ రెడ్డికి సవాల్
  • ఎనిమిదేళ్లుగా విచారణ ఎందుకు జరిపించలేదని నిలదీత
  • ప్రగతిభవన్ లో చేరి చిలకపలుకులు పలుకుతున్నారంటూ రోహిత్ పై విమర్శలు
BJP MLA Raghunandan Rao Press Meet

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేసిన ఆరోపణలపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సోమవారం స్పందించారు. ప్రెస్ మీట్ పెట్టి పైలట్ కు పలు ప్రశ్నలు సంధించారు. ఉద్యమంలో నుంచి ఎదిగిన నేతగా ఎల్లప్పుడూ ప్రజలకే జవాబుదారీగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలో పటాన్ చెరులో తాను పైసలు వసూలు చేశానన్న ఆరోపణలపై ఇప్పటి దాకా ఎందుకు విచారణ జరిపించలేదని నిలదీశారు. 

ప్రగతిభవన్ లో కొత్తగా చేరిన చిలుకలా పైలట్ చిలకపలుకులు పలుకుతున్నారని రఘునందన్ రావు విమర్శించారు. ఫైవ్ స్టార్ హోటళ్లలో సీసీటీవీ కెమెరాలు ఉంటాయని గుర్తుచేసిన బీజేపీ ఎమ్మెల్యే.. తాను ఏ ఫైవ్ స్టార్ హోటల్ లో ఉన్నానో వీడియో ఫుటేజీలు బయటపెట్టాలని సవాల్ విసిరారు. పార్క్ హయత్ హోటల్ నుంచి బీఆర్ఎస్ నేతలను కేసీఆర్ బలవంతంగా ఖాళీ చేయించారని రఘునందన్ రావు గుర్తుచేశారు.

తనను శుద్ధపూస అంటూ వెక్కిరిస్తూ రోహిత్ రెడ్డి మాట్లాడడంపై రఘునందన్ రావు స్పందించారు. 2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన రోహిత్ రెడ్డి.. ప్రచారంలో ‘అన్నం పెట్టే చేయి కావాలా? లేక దొరలు తిరిగే కారు కావాలా?’ అని ప్రజలను ప్రశ్నించారని గుర్తుచేశారు. దీనికి సంబంధించిన వీడియోను మీడియాకు చూపించారు. 

‘అన్నం తినిపించిన పార్టీకి సున్నం పెట్టినవ్.. బీఫామ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గోదావరిలో ముంచినవ్.. నువ్వు తిట్టిన దొరల కాంపౌండ్ లోనే చేరి ఇప్పుడు చిలకపలుకులు పలుకుతున్నవ్’ అంటూ రోహిత్ రెడ్డిపై రఘునందన్ రావు మండిపడ్డారు.

More Telugu News