Argentina: ఓటమిని జీర్ణించుకోని అభిమానులు.. ఫ్రాన్సులో చెలరేగిన అల్లర్లు

  • ఖతర్‌లో ఫిఫా ప్రపంచకప్ ఫైనల్
  • అర్జెంటినా చేతిలో ఓడిన ఫ్రాన్స్
  • పారిస్, నీస్, లయాన్ నగరాల్లో అభిమానుల వీరంగం
  • అదుపుతప్పిన శాంతిభద్రతలు
  • వైరల్ అవుతున్న వీడియోలు
 Millions Celebrate World Cup Victory At Iconic Argentina Monument

ఖతర్‌లో గత రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌లో అర్జెంటినా చేతిలో పరాజయం తర్వాత ఫ్రాన్స్‌లో అల్లర్లు చెలరేగాయి. ఓటమిని జీర్ణించుకోని ఫ్రాన్స్ అభిమానులు రాజధాని పారిస్, నీస్, లయాన్ నగరాల్లో పెద్దఎత్తున వీధుల్లోకి వచ్చి అల్లర్లకు పాల్పడ్డారు. వీధుల్లోకి భారీగా తరలివచ్చి వీరంగమేస్తున్న అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

వీధుల్లోకి వచ్చిన సాకర్ అభిమానుల్లో కొందరు పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. బాణసంచా కాల్చి వారిపై విసిరారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వారిని అదుపు చేసేందుకు పోలీసులు నానా కష్టాలు పడ్డారు. అల్లర్లు జరుగుతున్న ప్రాంతం నుంచి కారులో వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ మహిళపై లయాన్ నగరంలో దాడి జరిగినట్టు ఓ ట్విట్టర్ యూజర్ రాసుకొచ్చాడు.

ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు చివరికి బాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది. మ్యాచ్ తర్వాత వేలాదిమంది ఫుట్‌బాల్ అభిమానులు వీధుల్లోకి చొచ్చుకొచ్చి ఆందోళనకు దిగినట్టు ‘డెయిలీ మెయిల్’, ‘ది సన్’ వంటి పత్రికలు పేర్కొన్నాయి. బాష్పవాయువు ప్రయోగంతో సాకర్ అభిమానులు పరుగులు తీయడం కొన్ని వీడియోల్లో కనిపించింది. వెనక్కి వెళ్లిపోవాలంటూ ఆందోళనకారులను పోలీసులు హెచ్చరించడం కూడా వీడియోల్లో వినిపిస్తోంది. కాగా, ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దేశవ్యాప్తంగా 14 వేల మంది పోలీసులను మోహరించారు. అయినప్పటికీ అల్లర్లును ఆపలేకపోయారు.

More Telugu News