Theft: కుక్కకు కోడిమాంసం వేసి... గుంటూరులో లక్షలు దోచుకెళ్లారు!

Thieves silent a dog with chicken and stole lakhs of rupees in Guntur
  • గుంటూరులో ఓ మిర్చి కంపెనీలో దోపిడీ
  • రూ.20 లక్షల నగదు అపహరణ
  • వాచ్ మన్ ను కట్టేసిన దొంగలు
  • దొంగలు పారిపోయే క్రమంలో అరిచిన కుక్క
  • చికెన్ వేసి దాని నోరు మూయించిన దొంగలు
గుంటూరులో ఓ మిర్చి ఎక్స్ పోర్ట్స్ కంపెనీలో భారీ దోపిడీ జరిగింది. దోపిడీకి వచ్చిన దొంగలు అక్కడున్న కుక్కకు కోడిమాంసం వేసి తమ పని పూర్తిచేసుకుని వెళ్లారు. వెంకటప్పయ్య కాలనీ లాల్ పురం రోడ్డు చివరన ఓ మిర్చి కంపెనీ ఉంది. ఇక్కడి నుంచి మలేసియా తదితర దేశాలకు మిర్చి ఎగుమతులు చేస్తుంటారు. 

అయితే దొంగలు ఈ కంపెనీపై కన్నేశారు. గత అర్ధరాత్రి దాటిన తర్వాత ఇద్దరు దొంగలు బైక్ పై కంపెనీ వద్దకు వచ్చారు. తొలుత వాచ్ మన్ ఆవులయ్యను కట్టేశారు. వారు చంపేస్తామని బెదిరించడంతో వాచ్ మన్ కిక్కురుమనలేదు. వారిద్దరిలో ఓ దొంగ కంపెనీ ఆఫీసు రూమ్ తాళం పగులగొట్టి లోపలున్న డబ్బును దోచుకున్నాడు. 

ఇక, కంపెనీ నుంచి బయటికి వస్తుండగా, కుక్క అరవడంతో, దాని నోరు మూయించేందుకు చికెన్ ముక్కలు వేశారు. కోడిమాంసం ముక్కలు తినడంలో కుక్క బిజీగా ఉండగా, ఆ దొంగలిద్దరూ బైక్ పై పారిపోయారు. 

దోపిడీపై సమాచారం అందుకున్న మిర్చి కంపెనీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.20 లక్షలకు పైగా నగదు దోపిడీకి గురైందని వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.
Theft
Mirchi Company
Thieves
Dog
Chicken
Police

More Telugu News