Congress: మాదే ఒరిజినల్ కాంగ్రెస్... భట్టి నివాసంలో సీనియర్ల సమావేశం

  • తెలంగాణ కాంగ్రెస్ లో సంక్షోభం...?
  • ఇటీవల పీసీసీ కమిటీల ప్రకటన
  • బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కిన సీనియర్లు
  • బయటి నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత అంటూ విమర్శలు
Telangana Congress senior leaders held meeting in Bhatti residence

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై పార్టీ సీనియర్లకు అసంతృప్తి ఉందన్న విషయం అనేకసార్లు వెల్లడైంది. ఇటీవల కాంగ్రెస్ అధిష్ఠానం పీసీసీ కమిటీలను ప్రకటించిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో నిరసన గళాలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో కాంగ్రెస్ సీనియర్లు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ గౌడ్ తదితరులు హాజరయ్యారు. 

ఇటీవల ప్రకటించిన కమిటీల్లో 108 మందికి స్థానం కల్పించారని, అందులో సగం మంది టీడీపీ నుంచి వచ్చినవాళ్లేనని సీనియర్ నేతలు పేర్కొన్నారు. తమదే ఒరిజినల్ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. వలస నేతలు, టీడీపీ నేతలు అంటూ రేవంత్ తదితరులను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 

సీనియర్లయిన తమను పట్టించుకోకుండా, టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని వాపోయారు. కాంగ్రెస్ ను కాపాడుతున్న తమపై కోవర్టులు అనే ముద్రవేస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశాలను కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీని బతికించుకోవడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ, పీసీసీ కమిటీల ఏర్పాటులో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. తనను కలిసేవారికి న్యాయం చేయలేకపోతున్నానని అంటూ, ఈ విషయంలో తీవ్ర ఆవేదన కలుగుతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లపై గత ఏడాదిన్నరగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోందని, దీని వెనుక కుట్ర ఉందన్న అనుమానం కలుగుతోందని భట్టి పేర్కొన్నారు. 

ఇక ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ, తాను గతంలో పీసీసీ చీఫ్ గా వ్యవహరించానని, తన హయాంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు లేవని అన్నారు. పీసీసీ కమిటీల్లో ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి చోటిచ్చారని, ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు అన్యాయం జరిగిందని అభిప్రాయపడ్డారు.

More Telugu News