Russia: ఒక్క రోజులో 70కి పైగా క్షిపణులతో ఉక్రెయిన్​ పై రష్యా అతి పెద్ద దాడి

Russia fires more than 70 missiles in one of its biggest attacks on Ukraine
  • ఒకే రోజులో ఇన్ని క్షిపణలు ప్రయోగించడం ఇదే తొలిసారి
  • అంధకారంలో జెలెన్ స్కీ సొంత పట్టణం క్రైవీ రిహ్ 
  • రష్యా మరిన్ని దాడులు చేస్తుందంటున్న జెలెన్ స్కీ
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. కొన్ని నెలలుగా ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్న రష్యా తాజాగా మరింత జోరు పెంచింది. ఉక్రెయిన్‌ భూభాగాలపై 70కిపైగా మిస్సైల్స్‌ను ప్రయోగించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో క్షిపణులతో దాడి చేయడం ఇదే మొదటిసారి. 

ఇలా రష్యా క్షిపణుల వర్షం కారణంగా ఉక్రెయిన్‌ లో రెండో అతి పెద్ద నగరం అయిన క్రైవీ రిహ్‌ లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అధ్యక్షుడు జెలెన్‌స్కీ సొంత పట్టణమైన రిహ్ అంధకారంలో చిక్కుకుంది. ఓ అపార్ట్‌మెంట్‌పై క్షిపణి పడటంతో ముగ్గురు, ఖేర్సన్‌లో మరొకరు మరణించారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. కీవ్‌, ఖేర్సన్‌, ఖార్కివ్‌లోనూ విద్యుత్‌, నీటి సరఫరాకు అంతరాయం కలిగిందని వెల్లడించారు. 

ఉక్రెయిన్ లో రష్యా మోహరించిన అధికారులు.. షెల్లింగ్ లో 12 మంది మరణించారని తెలిపారు. మరోవైపు రష్యా వద్ద ఇంకా అనేక భారీ దాడులకు సరిపడా క్షిపణులు ఉన్నాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్‌స్కీ అన్నారు. ఈ నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు కీవ్‌కు మరింత సమర్ధవంతమైన రక్షణ ఆయుధాలను అందించాలని వీడియో సందేశం ద్వారా కోరారు. రష్యా దాడులకు తగిన ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు. ఉక్రెయిన్ తిరిగి పుంజుకునేంత బలంగా ఉందని చెప్పారు.
Russia
Ukraine
war
70 missiles

More Telugu News